జడ్జి కుర్చీపై క్షుద్రపూజలు..కర్నాటకలోని చిక్కబళ్లాపూర్‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలి అరెస్ట్

జడ్జి కుర్చీపై క్షుద్రపూజలు..కర్నాటకలోని చిక్కబళ్లాపూర్‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలి అరెస్ట్

చిక్కబళ్లాపూర్: న్యాయస్థానంలో జడ్జి కూర్చునే కుర్చీపై ఓ వృద్ధురాలు క్షుద్రపూజలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి అండ్ జేఎంఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కోర్టులో ఈ ఘటన జరిగింది. మంజుల (65) అనే వృద్ధురాలు కోర్టు గదిలోకి ప్రవేశించి, ఎవరూలేని సమయం చూసి జడ్జి కుర్చీపై తెల్ల ఆవాలు చల్లింది. సివిల్ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ పని చేసినట్లు తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం జరిగిన ఈ వింత దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిని గమనించిన కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిటీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై ‘కర్నాటక మూఢనమ్మకాల నిర్మూలన, క్షుద్రపూజల నిరోధక చట్టం-2017’ కింద కేసు నమోదు చేశారు. నిందితురాలికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.