న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) బుధవారం అమల్లోకి వస్తుంది. దీంతో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.9.60 లక్షల కోట్లు)చేరుకుంటుంది. ఈ ఎఫ్టీఏతో భారతీయ రైతులకు బ్రిటన్ వ్యవసాయ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు దొరుకుతాయి. సముద్ర ఆహార ఎగుమతిదారులపై సుంకం ఉండదు. శ్రమతో కూడిన రంగాలలో ఉన్న సుమారు 12 శాతం వరకు పన్నులు రద్దవుతాయి.
భారతీయ ఎగుమతులకు సంబంధించి దాదాపు 99 శాతం టారిఫ్ లైన్లపై సుంకాలు ఉండవు. దాదాపు 100 శాతం వాణిజ్య విలువను కవర్ చేస్తుంది. మనదేశం కూడా 90 శాతం టారిఫ్ లైన్లపై సుంకాలను తగ్గిస్తుంది లేదా రద్దు చేస్తుంది. ఇందులో 85 శాతం వస్తువులు పదేళ్లలో డ్యూటీ-ఫ్రీగా మారుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య సరుకు వాణిజ్యం విలువ 25.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్1.76 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును సాధించింది. బ్రిటన్‌కు మనదేశ ఎగుమతులు 13.44 బిలియన్ డాలర్లుగా ఉండగా, బ్రిటన్ నుంచి దిగుమతుల విలువ 11.68 బిలియన్ డాలర్లుగా ఉంది.
