బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లకు ఫైర్ మినహాయింపులివ్వండి.. హైడ్రా డీజీకి ట్రస్మా నేతల వినతి 

బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లకు ఫైర్ మినహాయింపులివ్వండి.. హైడ్రా డీజీకి ట్రస్మా నేతల వినతి 
  •     విద్యార్థుల భద్రతలో రాజీ పడబోమని హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లకు అగ్నిమాపక నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం (ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైడ్రా  డీజీ రంగనాథ్‌‌ను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం అందించింది. 20 నుంచి 30 ఏళ్ల క్రితం స్థాపించిన స్కూళ్లకు ప్రస్తుతం అమలు చేస్తున్న కఠినమైన ఫైర్ ఎన్‌‌వోసీ నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని ట్రస్మా నేతలు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు ఏర్పాటు చేసిన సమయంలో వాటి చుట్టూ తగినంత ఖాళీ స్థలం, వెడల్పయిన రోడ్లు ఉండేవని డీజీకి వివరించారు.

కానీ కాలక్రమేణా జరిగిన పట్టణీకరణ వల్ల స్కూళ్ల చుట్టూ అపార్ట్‌‌మెంట్లు, వాణిజ్య భవనాలు వెలిశాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం అగ్నిమాపక వాహనాలు లోపలికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లకు మినహాయింపు ఇచ్చినా.. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడబోమని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అధునాతన అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చాయి. నిబంధనలను యథాతథంగా అమలు చేస్తే వేలాది స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల మధ్యతరగతి, పేద విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ట్రస్మా ప్రతినిధులు పేర్కొన్నారు.