న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ గ్రూప్ తొమ్మిది రాష్ట్రాల్లో 18 గిగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపింది. ఏపీ, తమిళనాడు, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీల కోసం వివిధ గ్లోబల్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. జిందాల్ వినూత్న ఇంధన వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది.
2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది మద్దతుగా నిలుస్తుంది. జిందాల్ రెన్యూవబుల్స్ అనుబంధ సంస్థ జిందాల్ న్యూక్లియర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్లాంట్లలో 700 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల లార్జ్ మాడ్యూల్ రియాక్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి గిగావాట్ అణు ప్లాంట్ ఏర్పాటుకు రూ.15 వేల కోట్ల నుండి రూ.20 వేల కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది. మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభమవుతుంది.
