- విద్యార్థి నేతల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎఫ్ బీ, ఏఐపీఎస్ యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది స్టూడెంట్స్ ర్యాలీగా సెక్రటేరియెట్ వైపు దూసుకెళ్లారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. అరెస్టు చేసిన నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టడంతో లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.
కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నా సర్కార్ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, అరెస్టులతో గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గమన్నారు. వెంటనే బకాయిలన్నింటినీ ఏకకాలంలో విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పల్లె మురళి, మధుకర్, సన్నీగౌడ్, రవికుమార్, లెనిన్ గువేరా, శంకర్, పవన్ తదితర నేతలు పాల్గొన్నారు.
