బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తిరువీర్. తను హీరోగా భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ‘ఓ.. సుకుమారి’ చిత్రం జులై 17న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి హీరో తిరువీర్ ఇలా వివరించాడు.
ఓ అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే తన శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి లైఫ్‌లోకి ఓ అబ్బాయి వచ్చాక ఏం జరిగింది, తన ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది కథ. ఇందులోని కాన్‌ఫ్లిక్ట్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎంత నవ్విస్తుందో, అంతే ఎమోషన్‌కు గురిచేస్తుంది. చక్కని కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుంది.
గతంలో ఐశ్వర్య రాజేష్ గారితో 'టక్ జగదీష్'లో నటించా. తనతో సీన్స్ చేసేటప్పుడు చాలా విషయాలు చర్చించేవాళ్లం. మన కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం ఇంకా బాగా నటించడానికి ప్రయత్నిస్తాం. ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్లతో పనిచేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఇందులో పనిచేసిన చాలామందితో గతంలో కలిసి పనిచేయడం వల్ల సెట్లో చాలా కంఫర్ట్‌గా అనిపించింది.
ఎక్కడికి వెళ్లినా మహిళలు నేను చేసిన పాత్రల గురించి మాట్లాడుతుంటారు. వాళ్లకు సినిమా నచ్చితే కుటుంబమంతా చూస్తుంది. ఆ లెక్కన నేను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యానని భావిస్తున్నా. ఈ సినిమాతో మరింత దగ్గరవుతానని నమ్ముతున్నా. ప్రస్తుతం 'భగవంతుడు'తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నా. అలాగే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా.
ఈ ఏడాది నా నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. మరో రెండు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఓ నటుడిగా చాలా సంతోషంగా ఉంది. అయితే నాతో సినిమా చేస్తున్న దర్శకనిర్మాతలు బాగుండాలి, ప్రేక్షకులు ప్రతి సినిమాను ఆదరించాలనే బాధ్యత కూడా నాపై ఉంటుంది. ప్రస్తుతం నెలకు దాదాపు 20 కథలు వింటున్నా. ఒక నటుడితో సినిమా చేస్తే బిజినెస్ అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడే కదా వాళ్లు వస్తారు. ఆ లెక్కన నేను కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉన్నాను.
