శ్రీకాంత్, లయ జంటగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో జి. నాగేశ్వర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ మిడిల్‌క్లాస్’. జీకే అండ్ సీఎన్ నిర్మించిన ఈ చిత్రం జులై 17న విడుదలవుతోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకులు వీవీ వినాయక్, దశరథ్, రైటర్ కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఈరోజు ధనవంతులుగా ఉన్న వాళ్లలో చాలామంది ఒకప్పుడు మిడిల్‌క్లాస్ జీవితాన్నే గడిపారు. అలాంటి మధ్యతరగతి వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించబోతున్నాం. ఇలాంటి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ చేసి చాలా కాలమైంది. ఇందులో వెంకటేశ్వర స్వామిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది’ అని చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘వెంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని నాగేశ్వర్ రెడ్డి చెప్పినప్పుడు చాలా ఆలోచించా. అలాంటి పాత్రలు పోషించాలంటే చాలా భయం, భక్తి ఉండాలి. అందుకే ఎంతో నిష్ఠతో చేశాను. మేకప్ వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కూడా మనసు రాలేదు. ఎక్కువసేపు నిల్చునే ఉండేవాడిని. ఇలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు. ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని, కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి చెప్పాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
