ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆఫీస్ ఎదుట  వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త, కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

బాధితుడు రాజేందర్ రెడ్డి, అతడి భార్య సమత తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి రాజేందర్ రెడ్డి షాపు వద్దకు బిగుళ్ల శ్రావణ్, పైడిపాల మల్లేశం వచ్చి మద్యం తాగుతున్నారు. గమనించిన రాజేందర్ రెడ్డి వారిని ప్రశ్నించగా.. 'నిన్ను చంపడానికి వచ్చాం' అంటూ రాయితో కొట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన తప్పించుకున్నాడు. అనంతరం స్టేషన్ కు వెళ్లి ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. 

ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తులు సైతం పోలీస్ స్టేషన్ కు వచ్చి రాజేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాగా ఎమ్మెల్యే పీఏగా చెప్పుకుంటున్న మురళీధర్ రెడ్డి వారిని పంపించాడని, తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడని ఆరోపిస్తూ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ఆయనను కరీంనగర్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.