- న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పినందుకు రూ.3 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా ప్రవర్తనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన కోర్టును మోసం చేశారని, ఇచ్చిన హామీలను ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈమేరకు సమయ్ రైనాతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు కమెడియన్లు విపుల్ గోయల్, బల్‌రాజ్ సింగ్ ఘై, సొనాలి ఠక్కర్, నిశాంత్ తన్వర్‌లకు తలా రూ. 3 లక్షల జరిమానా విధించింది.
గతంలో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో వెన్నెముక కండరాల క్షీణత (ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధితో బాధపడుతున్న దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారంటూ రైనాతోపాటు నలుగురు కమెడియన్లపై ‘క్యూర్ ఎస్‌ఎమ్‌ఏ ఫౌండేషన్’ పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ మంగళవారం ఈ కేసును విచారించింది. గత విచారణల సందర్భంగా.. తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా దివ్యాంగులతో కలిసి షోలు నిర్వహిస్తామని, వారి చికిత్సకు కావాల్సిన నిధుల సేకరణ కోసం ప్రదర్శనలు ఇస్తామని కమెడియన్లు కోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే వారు ఈ హామీని నెరవేర్చలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అపరాజితా సింగ్ ధర్మాసనానికి వివరించారు.
రైనా క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్‌ను గానీ స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో బాధపడుతున్న వ్యక్తులను గానీ సంప్రదించలేదని తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని వాదించారు. మరోవైపు, తాము కోర్టు ఆదేశాలను పాటించామని, అందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశామని సమయ్ రైనా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కానీ.. కోర్టు రికార్డుల్లో అలాంటి అఫిడవిట్ లేదని ధర్మాసనం పేర్కొంది.
అఫిడవిట్ సమర్పించకుండానే కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి తప్పును మరింత పెద్దది చేసుకున్నారని వారిపై మండిపడింది. మొదట రూ.10 లక్షల జరిమానా విధించాలనే అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం, అనంతరం దాన్ని రూ.3 లక్షలకు తగ్గించింది. రెండు వారాల్లోగా జరిమానాను కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని ఆదేశించింది. అలాగే, తదుపరి 15 రోజుల్లోగా సరైన కంప్లయన్స్ అఫిడవిట్‌ను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఎస్‌ఎంఏ ఫౌండేషన్‌ను సంప్రదించకపోవడం అహంకారం వల్ల కాదని, తమ క్లయింట్లు కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించేలా చూస్తామని రైనా తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘‘దేశం వెలుపల ఉంటే తాము చట్టపరిధిలోకి రామని వారు భావిస్తున్నట్లున్నారు. ఇది అహంకారం కాకపోతే ఇంకేమిటి? ఇందుకు వారికి శిక్ష పడాల్సిందే’’ అని ఘాటుగా వాఖ్యానించింది.
