- సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రికార్డుస్థాయిలో భూసేకరణ
- రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌నూ నిర్మిస్తం
- తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపు
- అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు ఎయిర్‌పోర్ట్స్ నిర్మించాలని
- కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టును పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో రికార్డు స్థాయిలో భూసేకరణ పూర్తి చేశారని, దేశంలోనే అద్భుతమైన, అందమైన టెర్మినల్‌గా వరంగల్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్‌లోనూ రక్షణ శాఖ భాగస్వామ్యంతో సరిహద్దు వ్యూహాత్మక ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని ప్రకటించారు. మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పౌరవిమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు. నల్గొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, పౌరవిమానయాన శాఖ సెక్రటరీ సమీర్‌కుమార్ శర్మ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటకుపైగా సాగిన ఈ భేటీలో వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులపై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో వరంగల్ కీలక నగరంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మరింతగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలియజేశారు. అనంతరం రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్ పోర్ట్ పూర్తి చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ దిశలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి అనుకూలంగా డేట్ లైన్స్ పెట్టుకొని శరవేగంగా ఎయిర్ పోర్ట్‌ను నిర్మిస్తామన్నారు. ఈ మెయిన్ టెర్నినల్ డిజైన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా తీసుకున్నట్టు చెప్పారు.
దేశంలోనే ‘ది బెస్ట్ టెర్మినల్’గా వరంగల్..
వన్ ఆఫ్ ది బెస్ట్ కల్చరల్, బ్యూటీఫుల్ టెర్మినల్‌గా వరంగల్ ఎయిర్ పోర్ట్‌ను నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మెహన్‌నాయుడు తెలిపారు. ఇందుకోసం ప్రజలు, అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. కాకతీయ పాలన(డైనెస్టీ), వారు నిర్మించిన ఆలయాలు, సంస్కృతిని ఇందులో జోడిస్తామన్నారు. స్థానిక సంస్కృతి, కళలు, వారసత్వ మేళవింపుతో స్థానిక ప్రజలు గర్వంగా ఫీలయ్యేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.‘‘తెలంగాణలో ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలన్న చిరకాల డిమాండ్.. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి కావడం అదృష్టంగా భావిస్తున్నా. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మరిన్ని ప్రాంతాల్లో ఏవియేషన్ అవసరాలు ఉన్నాయి. వాటిని అన్ లాక్ చేయడానికి వరంగల్ ఎయిర్ పోర్ట్ అవసరం. స్థానికంగా ఉన్న ఇండస్ట్రియల్ హబ్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలతో కొత్తగా రాబోయే ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది” అని తెలిపారు.
రక్షణ శాఖతో కలిసి కలిసి ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతున్నదని రామ్మోహన్నాయుడు తెలిపారు. ఇక్కడ డిఫెన్స్ భూమి సుమారు 250 ఎకరా లు ఉండడం కలిసొచ్చే విషయమ ని పేర్కొన్నారు. అందువల్ల రక్షణ శాఖతో కలిసి ఈ ఎయిర్ పోర్ట్‌ను నిర్మించాలని ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ మీటింగ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేశారన్నారు. ఫైనల్‌గా రాజ్‌నాథ్ సింగ్ చొరవతో డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ముందుకు నడిపించాలని, రక్షణ శాఖ అధికారులు కూడా పాజిటి వ్‌గా ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. ఫైనల్‌గా ఈ ఎయిర్ పోర్ట్‌కు 1,700 ఎకరాల భూమి కావాలంటే.. ఈ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. వీలైనంత త్వరగా భూసేకరణ చేసుకుంటే.. కచ్చితంగా అద్బుతమైన ఎయిర్ పోర్ట్ ఆదిలాబాద్‌లో నిర్మితమవుతుందన్నారు. కేవలం సివిలియన్‌నే కాకుం డా.. డిఫెన్స్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆదిలాబాద్‌కు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలకు ఈ ఎయిర్ పోర్ట్.. డిఫెన్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌కు కూడా పౌర విమానయాన సంస్థ నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్‌కు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమణాలతో ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించండి: సీఎం రేవంత్
అంతకు ముందు వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఉన్న మెరుగైన పరిస్థితులను వివరించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లాలకు కేంద్రంగా వరంగల్ ఉంటుందని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్ట్‌లో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసినందున టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. 2028 జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలలని రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కేంద్ర మంత్రి, సీఎం చర్చించారు. వరంగల్‌కు ఘనమైన చరిత్ర ఉన్నందున, కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే, ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్‌తోపాటు పౌర విమానాశ్రయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఎయిర్ పోర్ట్‌లకు అవసరమైన భూమిని సేకరించి అందజేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ తరహాలోనే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు నెలకొల్పాలని కోరారు. వరంగల్, ఆదిలాబాద్ రెండు ఎయిర్ పోర్టులలోనూ విమాన శిక్షణ సంస్థలు (ఎఫ్‌టీఓ) నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు హుస్సేన్‌సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని రామ్మోహన్ నాయుడుకు సీఎం సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సీఎంను కోరారు.
తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలు ముందుకు రావాలి
వికసిత్ భారత్–2047 కల్లా ప్రపంచంలోనే ఇండి యా ఏవియేషన్‌ను ఒక హబ్‌గా నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సింగపూర్, దుబాయ్, టర్కీ. ఇతర దేశాలు ఎకనామిక్‌గా ఎదగడంలో ఎయిర్ పోర్ట్ లే కీలక పాత్ర పోషించాయన్నారు. ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ పోర్ట్స్ ను మరింత పెంచడంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. మరిన్ని ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలను అభినందించారు. ‘‘తెలంగాణ మాదిరిగానే.. ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా ముందుకు రావాలి. ఇలా గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మా శాఖ తరపున ధన్యవాదాలు’’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే ఉన్నతమైన ఎయిర్ పోర్ట్‌లతో హైదరాబాద్ ఒకటిగా ఉందన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి తాము ఒక ప్రాజెక్టును చేపట్టే సందర్భంలో.. ఎన్డీయేనా? నాన్ ఎన్డీయే (ఇండియా కూటమి) నా అనేది ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇండియా (భారత్) కు సంబంధించిన ప్రాజెక్ట్ గానే తాము ముందుకెళ్తామన్నారు. భూసేకరణలాంటి అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున.. సహకారం అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు: సీఎం రేవంత్
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలను ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాల అభివృద్ధిలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి తాము పాటుపడుతున్నామ న్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తమకు సహకరిస్తున్నదని, ఎక్కడైనా సమస్యలుంటే కేంద్ర మంత్రుల ను కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. ఏవైనా సమాచారలోపం ఉంటే దానిని పరస్పరం మార్చుకోవడం ద్వారా అధిగమిస్తున్నామని వివరించారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయంగా విమర్శలు చేయడం తగదని సీఎం హితవు పలికారు.
