పార్టీ లైన్ దాటొద్దు ఎవరైనా సరే.. హద్దు మీరితే ఉపేక్షించం  : మీనాక్షి

పార్టీ లైన్ దాటొద్దు ఎవరైనా సరే.. హద్దు మీరితే ఉపేక్షించం  : మీనాక్షి
  • కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర ఇన్​చార్జీ మీనాక్షి హెచ్చరిక 
  • 17న జిల్లాల ఇన్​చార్జీ మంత్రులతో మీనాక్షి భేటీ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే పార్టీ లైన్‌‌‌‌కు కట్టుబడి ఉండాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాల్సిందేనని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదర్‌‌‌‌‌‌‌‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె వరుసగా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, సీఎం సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ, తదితరులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో నేతల మధ్య ఏవైనా విబేధాలు ఉంటే అంతర్గతంగా పార్టీ వేదికలపై చర్చించుకొని పరిష్కరించుకోవాలని, బహిరంగంగా గొడవలకు దిగవద్దని చెప్పారు. సర్ ప్రక్రియ సాగుతున్న తీరుపై నియోజకవర్గాల వారిగా ఆరా తీశారు. దీనిపై పార్టీ నేతలు సీరియస్‌‌‌‌గా ఉండాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు.
 
నామినేటెడ్ పోస్టులు.. తొలి విడత కొత్త వారికే చాన్స్

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో జరిగిన సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై మీనాక్షి నటరాజన్ చర్చించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ డైరెక్టర్ పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల నియామకంపై చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవులు లేని వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, ముందుగా ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని చర్చించారు.   

పార్టీలో గొడవలు.. పరిష్కరించుకోవాలని ఆదేశం 

మీనాక్షిని ఎంపీలు రేణుకా చౌదరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, రఘు రామి రెడ్డి తదితరులు కలిశారు. నియో జకవర్గాల్లో పార్టీ పరిస్థితి, సర్ సాగుతున్న తీరు, పార్టీలో నెలకొన్న అసంతృప్తిపై మీనాక్షి ఆరా తీశారు. తుంగతుర్తి వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఎంపీ చామలకు సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న వివాదంపై మంత్రి కొండా సురేఖ ప్రస్తావించగా.. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా పని చేసుకుపోవాలని మీనాక్షి ఆదేశించారు.

అనవసరంగా తనను బయటకు తెస్తున్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తే మౌనంగా ఎలా ఉండాలని ఈ సందర్భంగా కొండా  సురేఖ ఆవేదనను వెలిబుచ్చారు. దీంతో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని మీనాక్షి సర్దిచెప్పారు. కాగా, ఎల్బీనగర్ వివాదంపై మీనాక్షి నటరాజన్‌‌‌‌కు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి కలిసి వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ ఇద్దరిపై యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ ఫిర్యాదు చేశారు.

ఆమెకు క్షమాపణలు చెప్పాలని శివచరణ్ రెడ్డిని మీనాక్షి ఆదేశించారు. దీంతో బయటకు వచ్చిన ఆయన.. ఈశ్వరమ్మ తనకు నాన్నమ్మ వంటిదని, తన మాటలు ఆమెను గాయపరిచినట్లయితే మనస్పూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. తనకు బీసీలంటే అభిమానం అని, తాను ఏ కులాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. అలాగే, బుధవారం ఉదయం శివచరణ్ రెడ్డి స్వయంగా ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పనున్నారు. ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డికి మాత్రం పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  

నేడు, రేపు డీసీసీ చీఫ్‌‌‌‌లతో భేటీ 

మీనాక్షి నటరాజన్ బుధ, గురువారం రెండు రోజుల పాటు డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ప్రోగ్రెస్ కార్డుతో రావాలని డీసీసీ చీఫ్‌‌‌‌లను ఆమె ఆదేశించారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తర్వాత వారు  చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రోగ్రాంలు, సర్ ప్రక్రియ సాగుతున్న తీరు, పార్టీలో సమన్వయం, ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్ర, ఇతర అంశాలపై ఈ రెండు రోజుల సమావేశంలో మీనాక్షి డీసీసీ అధ్యక్షుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు.

పలు విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి భేటీ కానున్నారు. ఆయా జిల్లా ఇన్​చార్జీ మంత్రులతో సమావేశమై.. జిల్లాల్లో సర్ ప్రక్రియ సాగుతున్న తీరు, పార్టీలో విభేదాలు, సమన్వయం, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించనున్నారు.