- నియామక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సీనియర్ ప్రొఫెసర్ భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సామాజిక నేపథ్యం కలిగిన భట్టు రమేష్‌కు 30 ఏండ్లకు పైగా బోధనానుభవం ఉంది. తెలుగు వర్సిటీలో రెండు సార్లు రిజిస్ట్రార్‌గా, జానపద గిరిజన విజ్ఞాన పీఠాధిపతిగా సేవలందించారు.
గిరిజన బాలల కోసం ‘బంజారా భారతి’, ‘బంజారా గణితం’ వంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. గతంలో శాంతి చర్చల మానిటరింగ్ కమిటీ, గిరిజన భూ రక్షణ చట్టాల పర్యవేక్షణ కమిటీలోనూ పనిచేశారు. వరంగల్ జిల్లాలో గుడుంబా బాధితులైన గిరిజన వితంతువుల పునరావాసం కోసం ఆయన చేసిన కృషికి గాను 2014లో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’, 2017లో ‘అంబేద్కర్ నేషనల్ అవార్డు’ అందుకున్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి భట్టు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
