వెలుగు ఓపెన్ పేజీ.. స్కిల్ కోర్సులతో మెరుగైన ఉపాధి అవకాశాలు

వెలుగు ఓపెన్ పేజీ.. స్కిల్ కోర్సులతో  మెరుగైన ఉపాధి అవకాశాలు

ప్రపంచంలోని అతిపెద్ద యువత జనాభా ఉన్న దేశాలలో  మన దేశం ఒకటి.   దాదాపు 600 మిలియన్ల మంది 25 ఏళ్లలోపు ఉన్నారు.  ప్రపంచవ్యాప్తంగా సగం మంది జనాభా వయసు 30 లేదా అంతకంటే తక్కువ.  2030 చివరి నాటికి  57% పైన  యువ  జనాభా చేరుకుంటుందని అంచనా. 15 నుంచి 24 ఏళ్ల వయస్సు గల  యువకులలో  13.1% మంది,  యువతులలో 28.2% మంది (దాదాపు ముగ్గురిలో ఒకరు) ఎటువంటి విద్య, ఉపాధి లేదా శిక్షణ  లేక ఖాళీగా ఉన్నారు.  2023లో  ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 మిలియన్ల యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.  ప్రతి పదిమందిలో  ఏడుగురిలో ఆధునిక పరిశ్రమ,  వివిధ రంగాలకు కావలసిన నైపుణ్యాలు  లేకపోవడం వలన సరైన ఉపాధి దొరకడం లేదు.   దేశ ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వాములు కావడం లేదు.  ఇప్పుడున్న నైపుణ్య సామర్థ్యాలలో 40% ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదు.

సరికొత్త టెక్నాలజీ వల్ల సమీప భవిష్యత్తులో సుమారు 22% ఉద్యోగాల రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ రంగాలు చెబుతున్నాయి.  అంతేకాకుండా  ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 86 శాతం మంది విద్యార్థులు ఏఐ ఆధారిత పనిచేయడానికి సుముఖంగా లేరని  తెలిసింది. పెరుగుతున్న  యువజన  జనాభా కోసం  ఉపాధి కల్పన,  వారి శక్తియుక్తులను దేశాభివృద్ధికి విలువైన వనరుగా ఉపయోగించుటకోసం వారిలో నైపుణ్యాభివృద్ధి  పెంపొందించడం కోసం తగిన శిక్షణా కార్యక్రమాలు  రూపొందించాలని 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది.  

ప్రతి సంవత్సరం జులై 15వ తేదీ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరింది.   ఈ సందర్భంగా వివిధ సామాజిక,   చైతన్య కార్యక్రమాల ద్వారా యువత  వివిధ  నైపుణ్యాల కోసం శిక్షణను పొంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవాలని  ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు  సభ్య దేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు యువత  సుస్థిరమైన  భవిష్యత్తును తీర్చి దిద్దడానికి  నైపుణ్య శిక్షణలు ఉపయోగపడతాయి. 

నైపుణ్యత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం

యువతీ యువకుల పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయాలంటే  నాణ్యమైన విద్య,  శిక్షణలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఆసన్నమైనది.  వివిధ  పరిశ్రమలకు  కావలసిన నైపుణ్యతను గుర్తించి, వాటిపైన శిక్షణ అందించి అంతరాలను అధిగమించి  నిరుద్యోగ సమస్యకు  ఒక పరిష్కారం చూపించి జీవనోపాధి  అవకాశాలను కలిగించాలి.  ప్రపంచవ్యాప్తంగా పని స్వరూపం మారుతుంది. 

కృత్రిమ మేధ వినియోగం, పర్యావరణ పరిరక్షణ,  సుస్థిర  ఉద్యోగ ఉపాధి అవకాశాల అనుకూల మార్పులు  మార్కెట్లో వస్తున్నాయి.  వీటితోపాటు మనం నేర్చుకునే,  చేసే పనిలో సామాజిక అభివృద్ధి ఉండాలని నేటి పారిశ్రామిక రంగాలు,  ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ఈ మారుతున్న  వాతావరణంలో రాణించాలంటే,  యువతకు  కేవలం  సాంకేతిక  నైపుణ్యాలు మాత్రమే సరిపోవు.  వారికి  సాంకేతిక,  డిజిటల్, ఏఐ,  సాంకేతికత భర్తీ చేయలేని  మానవీయ దృక్పథం ఎంతో అవసరం. 

 యువతకు  ఆధునిక నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలను చేపట్టింది.   యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వివిధ కంపెనీలకు కావలసిన సాంకేతిక మానవ వనరులను అందించడంతోపాటు,  ఆయా సంస్థల ద్వారా యువతీ యువకులకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి  కృషి చేస్తోంది. 

మార్కెట్ డిమాండ్​కు అనుగుణంగా శిక్షణ

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ  పరిధిని మరింత విస్తరించి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు,  అడ్వాన్స్‌‌‌‌డ్  టెక్నాలజీ సెంటర్లను (గతంలో ఐటీఐలు) ఈ యూనివర్సిటీ  పరిధిలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్ల ద్వారా అన్ని రకాల స్థానిక పరిశ్రమలలో యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నది.  అలాగే,  కార్మికశాఖ పరిధిలో ఉన్న 63  ప్రభుత్వ ఏటీసీలు, 219 ప్రైవేట్ ఐటీఐలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి తేవడంతోపాటు   ప్రస్తుత మార్కెట్ డిమాండ్ అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించి ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా  కార్మికశాఖ కూడా కృషి చేస్తున్నది. 

ఇటీవల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో  డేటా సైన్స్ మేనేజ్‌‌‌‌మెంట్  కోర్సు పూర్తిచేసిన మొత్తం 14 మంది విద్యార్థులలో  ఏకంగా 11 మంది  మైక్రోసాఫ్ట్  క్యాంపస్  సెలక్షన్‌‌‌‌లో ఎంపికయ్యారు.  వీరికి  ఏడాదికి రూ.7 లక్షల చొప్పున ఆకర్షణీయమైన  వార్షిక  ప్యాకేజీలు  లభించాయి. అంతేకాకుండా  వివిధ ఏటీసీలలో  శిక్షణ  పొందిన  యువతీ యువకులకు మంచి ఉపాధి అవకాశాలు దొరికాయి.

మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలకరంగం

మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం చాలా కీలకమైన రంగం.  వ్యవసాయంలో యువతీ యువకులను నిమగ్నం చేయడం ద్వారా ప్రపంచ ఆహార భద్రతను పరిష్కరించడానికి,  దేశానికి పోషకాహార భద్రత,స్థిరమైన ఆహార ఉత్పత్తి,  సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడానికి ఎంతో కీలకమైనది.  యువతీ యువకులు తాజా దృక్కోణాలు, వినూత్న  ఆలోచనలు,  కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. యువతీ యువకులు,  రైతులు,  మహిళా రైతుల ఆలోచనలు,  ఆసక్తికి అనుగుణంగా  ప్రొఫెసర్ జయశంకర్  తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  వివిధ  నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు,  సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. 

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి  ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తున్నది.  ఉప కులపతి  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని  13 కాలేజీలు,  8 కృషి విజ్ఞాన కేంద్రాలు,  23 రైతు విజ్ఞాన కేంద్రాలలో 22 స్కిల్ ట్రైనింగ్ కోర్సులు ప్రారంభించారు.  పరిశ్రమ ఆధారిత సిలబస్,  ప్రత్యక్ష శిక్షణ  ద్వారా నైపుణ్యాలను అభివృద్ధిపరిచి  వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం  చేయడంతోపాటు  గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను  పెంపొందించడానికి  కోర్సులు  రూపొందించారు.

- డాక్టర్ ఎ. పోశాద్రి అసిస్టెంట్ ప్రొఫెసర్,ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్​వర్సిటీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. 

స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.