రోజురోజుకూ విస్తరిస్తూ హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా మారుతోంది, ఐటీ, ఫార్మా, డిఫెన్స్ వంటి నేటి ఎమర్జింగ్ ఇండస్ట్రీలతోపాటు సంప్రదాయిక వ్యవసాయ, ఇండస్ట్రీ ఉత్పత్తుల్లో నేడు దేశంతోకాదు ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోంది. మరి ఇంతటి విసృత ప్రాధాన్యం ఉన్న నగరానికి ఎప్పుడో 1955 నాటి జీహెచ్ఎంసీ చట్టంతోనే పాలన కొనసాగాలా? మౌలికమైన ఈ అంశంపై పదేళ్ల స్వయం పాలనలో జరిగిన నిర్లక్ష్యం ఇంకా కొనసాగాలా? ఒక శాఖతో ఇంకో శాఖకు సంబంధం, సమన్వయం లేకుండా ఎవరికివారు గుంతలు తీస్తూ, గోతులు తవ్వుతూ, మరొకరు పనిని చెడగొడుతూ... ఇలా సామాన్యుడికి నిత్యం నరకం కావాల్సిందేనా? వీటికి సమాధానమే నాటి జీహెచ్ఎంసీ చట్టాన్ని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పాలనకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లే ‘ద కోర్ అర్బన్ రీజియన్ (సమీకృత పాలన) బిల్లు’ . దీని ఉద్దేశాన్ని పైన చెప్పినట్టుగా బిల్లు ప్రారంభంలో (లాంగ్ టైటిల్) స్పష్టం చేశారు.
పాలసీ వాచ్ పేరుతో పెద్దలు డా. దొంతి నరసింహారెడ్డి శనివారం జులై 11న వెలుగు దినపత్రిక ఓపెన్ పేజీ కాలమ్‌లో ‘క్యూర్ బిల్లు ఎవరికి జవాబుదారీ?’ అనే వ్యాసం చదివి స్పందిస్తున్నాను. ఈ బిల్లు అవసరం, అందుకు సహేతుక కారణాల గురించి అందులో చెప్పలేదు అని వారు రాయడం విస్మయానికి గురిచేసింది. అందుకే అందులో వారు లేవనెత్తిన సందేహాలు నిస్సందేహంగా నిరర్థకమైనవి. ఈ బిల్లు నగర రూపురేఖల్ని నేటి అవసరాలకు అనుగుణంగా ఎంత వేగంగా మారుస్తుంది, హైదరాబాద్ మహానగరం పరిధిని క్యూర్‌గా విస్తరిస్తూనే ఇక్కడ నివసించే కోటిన్నర మందికి మెరుగైన మౌలిక వసతుల్ని, ప్రపంచస్థాయి సౌకర్యాల్ని ఈ బిల్లు అందిస్తుంది అనేది చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
ఏ నూతన ప్రతిపాదన అయినా ప్రభుత్వమే తెస్తుంది
271 పేజీలు డౌన్‌లోడ్ ఇవ్వలేదు, తెలుగులో లేదు అనేది కేవలం సాంకేతికపరమైన అంశాలే తప్ప ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించే అంశాలు కావనేది ఈ డ్రాఫ్ట్ బిల్లుపై ఆయన రాసిన వ్యాసమే అతి పెద్ద సాక్ష్యం. ఆయనే చెప్పారు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం ‘ద కోర్ అర్బన్ రీజియన్ (సమీకృత పాలన) బిల్లు’ తెచ్చారు అని, అంటే ఆ డాక్యుమెంట్ రూపొందించిన ప్రభుత్వమే ఈ బిల్లును ప్రతిపాదిస్తుందని ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక జీహెచ్ఎంసీ చట్టాన్ని తొలగిస్తూ తెస్తున్న మరో చట్టం ముసాయిదా ఆ సైట్‌లో పెట్టడం సమంజసమే కదా. మున్సిపల్ కార్పొరేషన్ల మీద ప్రభుత్వ పెత్తనం అనేది డ్రాఫ్ట్ లో 474 సార్లు ‘ప్రభుత్వం’ అనే పదం చేర్చింది కాబట్టే అనడం అసమంజసం. బిల్లు రూపకల్పనలో ఉండే సహజ ప్రక్రియలు, డ్రాఫ్ట్ రూపొందించే భాష గురించి వ్యాసకర్త మరింతగా పరిశోధిస్తే .. అవన్నీ చాలా సర్వ సాధారణ అంశాలని, ఏ చట్టం రూపకల్పనలోనైనా పదబంధాల వినియోగం ఒక పద్ధతి ప్రకారమే ఉంటుందని బహుశా ఆయనే ధ్రువీకరించుకునేవారు.
ప్రతీ కార్పొరేషన్ సమాచారం ఇవ్వాలనేది ఎలా తప్పవుతుంది?
ఈ బిల్లు స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ప్రతీ కార్పొరేషన్ సమాచారం ఇవ్వాలి అనేది ఎలా తప్పవుతుంది, అప్పుడే కదా అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగేది. చివరకు సరిహద్దు మార్పులు ఎవరికివారే తీసుకునే సొంత నిర్ణయం కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సినది, దాన్ని ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అంతిమంగా అపెక్స్ కౌన్సిల్ సమన్వయ బాధ్యతల్ని చూడటానికే ఏర్పాటు చేస్తున్నాం అని ముసాయిదాలోనే స్పష్టంగా చెప్తున్నారు కదా. ఆ వ్యాసంలో ప్రధానంగా ప్రస్తావించినది బల్డియాను బలితీసుకోవడం అంటూనే అధికారాల కేంద్రీకరణ అనడం. కానీ ఇది కేవలం డ్రాఫ్ట్ లో పొందుపరిచిన అంశాల్లోని పదబంధాలపై వ్యాసకర్త అన్వయం మాత్రమే కానీ, వాస్తవ రూపం కాదనేది సుస్పష్టం. పార్ట్ 3, చాప్టర్ 26లోని 231వ అంశాన్ని, అందులోని ప్రజాస్వామిక స్ఫూర్తిని ఒడిసిపడితే స్పష్టంగా ఈ బిల్లు ఎంత ప్రజాస్వామికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన, కోటిన్నర ప్రజలు జీవిస్తున్న ప్రాంతంలోని అస్తవ్యస్తాలన్నింటినీ తొలగించి జీహెచ్‌ఎంసీ పేరుతో ఉన్న అతి పెద్ద పాలనా వ్యవస్థను వికేంద్రీకరిస్తూ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎలా కేంద్రీకరణో అర్థం కావడం లేదు.
పాలనా సౌలభ్యం కోసమే
పాలనా సౌలభ్యం కోసమే అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా ‘ద కోర్ అర్బన్ రీజియన్ (సమీకృత పాలన) బిల్లు’ తేవడమే కదా ఈ ముసాయిదా లక్ష్యం. దాదాపు ఇదేవిధంగా ముఖ్యమంత్రులే సారథ్యం వహిస్తూ ముంబయిలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( ఎంఎంఆర్‌డీఏ), బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బీఎంఆర్‌డీఏ), కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కేఎండీఏ), చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ)లు పనిచేస్తున్నాయి కదా. ఇక్కడ కూడా క్యూర్ ప్రాంతానికి ముఖ్య మంత్రే చైర్మన్‌గా ఉంటారు కదా? వ్యాసకర్త పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం గుండెకాయ, ఎకానమీ క్రియేషన్‌లో అతిపెద్ద ఏరియా, మూడున్నర కోట్ల ప్రజల్లో కోటిన్నర నివసిస్తున్న ప్రాంతానికి ప్రజలెన్నుకున్న
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే చైర్మన్‌గా ఉండాల్సింది. పైగా ఈ డ్రాఫ్ట్ బిల్లులో అపెక్స్ సభ్యుల సంఖ్యను పరిమితం చేయలేదు, ప్రతీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కేవలం మేయర్‌ని, ఎమ్మెల్యేలనే కాదు కార్పొరేటర్లు, వార్డు కమిటీలను సైతం పిలిచే అవకాశం కల్పిస్తుంది. గత ప్రభుత్వ పాలనానుభవాల భయాలతో, ప్రజాపాలనలోనూ ఇలాగే జరుగుతుందనే భ్రమలతో ప్రజల్లో భయాందోళనలు కల్పించడం సరికాదు.
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ..
ప్రభుత్వ ఖజానాపై దీర్ఘకాలిక భారమని చేసిన వాదన మరింత విచిత్రంగా ఉంది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243S సూచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ మున్సిపల్ కౌన్సిళ్లే కాదు వార్డు కమిటీలను సైతం క్యూర్ బిల్లు ప్రతిపాదిస్తుంది. అంతేకాకుండా చాప్టర్ 5లోని సెక్షన్ 32, 33లు స్పష్టంగా స్థానిక సంస్థల అధికారాలను సూచిస్తుంది, ఆయా స్థానిక సంస్థల విధుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా పారిశుద్ధ్య నిర్వహణ, అస్తిపన్ను వసూళ్లు, పన్ను నిర్ధారణ వంటి అన్ని అధికారాలు, మైక్రోలెవల్ ప్లానింగ్ కేవలం ఆయా స్థానిక సంస్థలే చేసుకుంటాయని సూచిస్తుంది, అపెక్స్ కౌన్సిల్ అయినా ఎగ్జిక్యూటివ్ కమిటీ అయినా మైక్రోలెవల్ ప్లానింగ్ చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన పాలనను, సౌకర్యాలను అందించడానికి మాత్రమే పనిచేస్తాయి.
పౌరులు అప్పీలు చేసేందుకు ప్రత్యేక అప్పీలేట్ అథారిటీ
ఇక ఈ బిల్లులోని సింగిల్ విండో డిజిటల్ గవర్నెన్స్, గ్రీన్ కవర్, క్లైమేట్ ప్రొటెక్షన్, మహిళల భద్రత, గిగ్ వర్కర్లు మొదలు కార్మికుల సంక్షేమం, రోడ్లు, ట్రాఫిక్, పారిశుధ్యం, ప్రజారోగ్యం, అర్బన్ బయో డైవర్సిటీ, నీటి సరఫరా, హైడ్రా, డిజిటల్ గవర్నెన్స్, జెండర్ ఇంక్లూజన్ వంటి అనేక అంశాలను చర్చలోకి తీసుకోలేదు. ముఖ్యంగా జవాబుదారీతనాన్ని పెంచేలా, ప్రజలకు ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించేలా పౌరులు అప్పీలు చేసేందుకు ప్రత్యేక అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు నుంచి నలుగురు పూర్తికాల సభ్యులు ఉంటారు.
వీరిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతినిధి ఎన్నుకుంటారు. తద్వారా పూర్తి పారదర్శకతతో జవాబుదారీతనం ఉంటుందనేది ఎవరికైనా ఆమోదనీయ మార్గం. ముఖ్యంగా 2023 డిసెంబర్‌లో ప్రజాపాలన మొదలైన దగ్గరి నుంచి ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్న దాఖలాలు లేవు. ప్రతీ అంశంలోనూ ప్రజల కోణంలోనే పరిపాలన సాగుతున్నప్పుడు పూర్తి చట్టరూపం దాల్చని ముసాయిదా బిల్లుపై ఏదో జరిగిపోతుందనేలా ఊహించుకోవడం సరి కాదు. ఆ ముసాయిదాలోనే స్పష్టంగా ప్రజలు తమ అభిప్రాయాల్ని తెలియజేయాలని సూచించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయమే అంతిమం.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిసాట్ నెట్‌వర్క్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
