- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్లో 1996లో 23 మందికి 22.26 ఎకరాల అసైన్డ్ పట్టాలు
- పహాణీలో పాత యజమాని పేరు కొనసాగడంతో 2018 నుంచి మ్యుటేషన్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు
- సర్పంచ్ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన కలెక్టర్
- 22.26 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పేదలకు సీలింగ్ చట్టం కింద పంపిణీ చేసిన భూముల రికార్డులను తారుమారు చేసి అక్రమంగా మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు చేశారు. ట్రిబ్యునల్, హైకోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చినప్పటికీ ధరణిలో ప్రైవేట్ పేర్లపై నమోదు చేసి కోట్ల రూపాయలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. దీంతో 22.26 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ భూములుగా నమోదు చేయాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
పేదల భూమి మళ్లీ పెద్దల చేతుల్లోకి..
కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలోని సర్వే నంబర్ 545లో 11.26 ఎకరాలు, సర్వే నంబర్ 551లో 11 ఎకరాలు ఒకప్పుడు పి.లక్ష్మణరావు కుటుంబానికి చెందినవి. ఏపీ భూ సంస్కరణల చట్టం-1973 ప్రకారం ఈ భూములు సీలింగ్ పరిమితికి మించి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. భూ సంస్కరణల ట్రిబ్యునల్ ఆదేశాలు, హైకోర్టు తీర్పుతో 1992లో ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. 1996లో 12 మంది ఎస్సీలు, 10 మంది బీసీలు, ఒక ఓసీ లబ్ధిదారుడికి అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. అయితే లబ్ధిదారులకు కేటాయించిన భూమి ఎక్కడ ఉందో చూపించలేదు. భూమి గురించి అడిగితే బెదిరింపులకు గురి చేశారని, పోలీసులతో భయపెట్టారని లబ్ధిదారులు వాపోతున్నారు.
ధరణి ఎంట్రీతో ప్రైవేట్ భూమిగా..
గత ప్రభుత్వ హయాంలో ధరణి ఎంట్రీతో 2018 సెప్టెంబర్ 24న సర్వే నంబర్ 545/ఎలో 7.26 ఎకరాలను పి.కృష్ణారావు పేరుపై నమోదు చేశారు. 2018 అక్టోబర్ 17న సర్వే నంబర్ 545/బిలో ఒక ఎకరాన్ని గోలి అనిత పేరుపై నమోదు చేశారు. 2019–-20లో సర్వే నంబర్ 551లోని 11 ఎకరాలను పి.కృష్ణారావు పేరుతో ధరణిలో నమోదైంది. కలెక్టర్ విచారణలో ఈ ఎంట్రీలకు చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు, హక్కులకు సంబంధించిన ఆధారాలు లేవని తేలింది.
అక్రమ మ్యుటేషన్లతో రిజిస్ట్రేషన్లు
అక్రమ మ్యుటేషన్ల తర్వాత భూములను విక్రయించినట్లు విచారణలో తేలింది. 2020 నవంబర్ 21న సేల్ డీడ్ నంబర్ 47/2020 ద్వారా 3.33 ఎకరాలను పునుగోటి హరీశ్ కు విక్రయించారు. అదే రోజు సేల్ డీడ్ నంబర్ 48/2020 ద్వారా మరో 3.33 ఎకరాలను పునుగోటి నరేశ్ కు అమ్మారు. 2025 జనవరి 18న సేల్ డీడ్ నంబర్ 68/2025 ద్వారా 5.20 ఎకరాలను బొడ్ల సతీశ్‌కు విక్రయించారు. అదే రోజు సేల్ డీడ్ నంబర్ 70/2025 ద్వారా మరో 5.20 ఎకరాలను బొడ్ల ఉమాదేవికి అమ్మారు. ఈ నాలుగు విక్రయాల్లోనూ అమ్మకందారులకు చట్టబద్ధమైన హక్కు లేదని కలెక్టర్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.
పేదలకు న్యాయం జరగాలి
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూములు అక్రమంగా ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ విషయాన్ని బాధితులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు విచారణ జరిపి భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- నీలగిరి గంగారావు, రాంసాగర్ సర్పంచ్
మళ్లీ ప్రభుత్వ ఖాతాలోకి..
రాంసాగర్ సర్పంచ్ నీలగిరి గంగారావు బాధితులతో కలిసి 2026 జూన్ 15న ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో విచారణ జరగడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఈ నెల 7న కలెక్టర్పి. కృష్ణారావు, గోలి అనిత, పునుగోటి హరీశ్, పునుగోటి నరేశ్, బొడ్ల సతీశ్, బొడ్ల ఉమాదేవి పేర్లతో నమోదైన రెవెన్యూ ఎంట్రీలను రద్దు చేసి, భూమిని ప్రభుత్వ ఖాతాలో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్రమణలు తొలగించి భూభారతి పోర్టల్‌లో ప్రభుత్వ హక్కును పునరుద్ధరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
