మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ కుమార్దీపక్

 మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ కుమార్దీపక్
  •     రైతులు ఆందోళన చెందవద్దు
  •     యాప్​లో బుక్​ చేసుకున్న వారికి వెంటనే అందజేస్తాం
  •     చెన్నూర్​లో కొరత ఉందంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దు: కలెక్టర్ కుమార్​ దీపక్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్​దీపక్ తెలిపారు. ఈ సీజన్​కు సరిపడా యూరియా, డీఏపీ సొసైటీలతో పాటు ప్రైవేట్​ షాపుల్లో స్టాక్​ఉందన్నారు. చెన్నూర్ మండలంలో యూరియా కొరత ఉందంటూ కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. జిల్లాలో ఏటా 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని, ఈ సీజన్​లో ఇప్పటికే 9 వేల టన్నులు రైతులకు సప్లై చేశామన్నారు. ఇంకా 9 వేల టన్నులు స్టాక్​ ఉందని, మరో 9 వేల టన్నులు తెప్పిస్తున్నామని తెలిపారు. గతేడాది కంటే ఈసారి 2 వేల టన్నులు ఎక్కువగానే అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. 

చెన్నూర్ మండలంలో 120 మెట్రిక్ టన్నుల స్టాక్​ ఉందన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సొసైటీల ద్వారా సప్లై చేస్తున్నామన్నారు. యూరియా బుకింగ్​లో ఇబ్బందులు ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీలను, ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. యూరియా, డీఏపీ పక్కదారి పట్టించినా, ఇతర అవసరాలకు మళ్లించినా క్రిమినల్​చర్యలు తప్పవని హెచ్చరించారు.