వెలుగు ఓపెన్ పేజీ.. ఆరుగురి ప్రాణాలు తీసిన సైకోపాథిక్ ధోరణి

వెలుగు ఓపెన్ పేజీ.. ఆరుగురి ప్రాణాలు తీసిన సైకోపాథిక్ ధోరణి

ఒక మనిషి పగతో ఆరుగురిని చంపి, చివరకు తను ఆత్మహత్య చేసుకోవడం అనేది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద 'నైతిక పతనం. నేటి ఆధునిక సమాజంలో ప్రేమ, సంబంధం అనేవి అత్యంత సున్నితమైన అంశాలుగా ఉండాల్సింది పోయి,  అవే  క్రూరమైన హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. 

వాస్తవంగా ఇది ఒక ‘ సైకో- సోషల్ ఫెయిల్యూర్’. ఈ ఘటన మనకు ఒక తీర్పులా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది మన వ్యవస్థలోని లోపాలను, వ్యక్తుల మానసిక స్థితిని ఎత్తిచూపుతున్న ఒక అలారం. ఈ ధోరణి మారాలంటే  మనం సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవాలి.

ఆధిపత్యం, బానిసత్వం

మగవారు ఆడవారికి దాసోహమవ్వడం, లేదా ఆడవారు మగవారిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవాలనుకోవడం.. ఈ రెండూ నిజమైన ప్రేమకు సంకేతాలు కావు. ఇవి ఆరోగ్యకరమైన సంబంధాల పునాదులు కూడా కావు. ప్రేమలో యజమాని ఉండడు.. బానిస ఉండడు. ఇద్దరూ సమాన భాగస్వాములే. ‘నువ్వు లేకపోతే  నేను బతకలేను’, ‘నా ప్రపంచం నువ్వే’, అనే స్థాయిలో ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరొకరి చేతుల్లో పెట్టేయడం. ఇది ప్రేమ కాదు,  భావోద్వేగ ఆధారపడటం. అలాంటి బంధం తెగిపోయినప్పుడు,  తన ప్రపంచమే కూలిపోయిందని,  తన ఉనికికే అర్థం లేదని భావించే ప్రమాదకరమైన  మానసిక స్థితి ఏర్పడుతుంది. 

దాన్ని సైకాలజికల్ డిపెండెన్సీ అంటారు. తర్వాత అభద్రతాభావంతో  తిరస్కరణను భరించే సామర్థ్యం లేకపోవడం, ‘నన్ను వదిలి ఎలా సంతోషంగా ఉంటావు?’ అనే అహం కలిసినప్పుడు, అది ప్రతీకార భావనగా మారుతుంది. అక్కడినుంచే రివెంజ్ కల్చర్  ప్రారంభమవుతుంది.‘నేను లేని జీవితం నీకెందుకు?’,  ‘నువ్వు నాదానివే... నాకు దక్కకపోతే  ఇంకెవరికీ  దక్కకూడదు’ అనే ఆలోచనలు  ప్రేమ భాష కాదు. అవి స్వాధీన భావం, అహంకారం, ‘గాడ్ కాంప్లెక్స్’ లక్షణాలు. ఎదుటివారి జీవితం మీద తీర్పు చెప్పే హక్కు తనకే ఉందని భావించే ప్రమాదకరమైన మానసిక వక్రీకరణ. చివరికి అలాంటి ఆలోచనలు  రెండు కుటుంబాలను శాశ్వతంగా  చీకటిలోకి  నెట్టే హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తాయి.

సమ్మతిని మించిన పెత్తనం

తప్పుడు కేసులు, వేధింపులు నిజమైన బాధితులని కూడా నేరస్థుల దగ్గరకు నెట్టే ప్రమాదం ఉంది. చట్టం ఆలస్యం అవుతుందనో, లేదా చట్టం స్త్రీలకే పక్షపాతంగా ఉందనో నమ్మడం వల్ల, ఇద్దరూ ఆత్మరక్షణ లేదా ప్రతీకారం కోసం హింసను ఆశ్రయిస్తున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ వ్యవస్థకు పెద్ద సవాలు. నేటి సంబంధాల్లో సమ్మతి కంటే అధికారం ఎక్కువైపోయింది. అబ్బాయిలు అమ్మాయిల మీద, అమ్మాయిలు అబ్బాయిల మీద ఒక రకమైన యాజమాన్యాన్ని ప్రదర్శించాలనుకోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి  మనకు  నచ్చినట్లు  ఉండాలని ఆశించడం అహంకారం.  ఎదుటివారిని  వదిలేయలేక, వారితో కలిసి ఉండలేక జరిగే సంఘర్షణలో ఇద్దరూ బలి అవుతున్నారు.  నిష్క్రమించే  హక్కు ఎవరికైనా ఉందని గుర్తించాలి.

పెరుగుతున్న  సైకోపాథిక్  ధోరణులు 

కుక్కర్లలో చంపడం, ముక్కలు చేయడం వంటి అత్యంత కిరాతక చర్యలు సామాన్యమైనవి కావు. ఇవి తీవ్రమైన యాంటీ-సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ సంకేతాలు. తక్షణ పరిష్కారం కోరుకునే తత్వం, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా బంధం విచ్ఛిన్నమైనప్పుడు, దాన్ని ఎదుర్కొనే ఓపిక లేక, ఒక్క క్షణం  ఆవేశంలోనే ప్రాణాలను తీయడం లేదా తీసుకోవడం చేస్తున్నారు. సైకోపాథిక్ ధోరణి ఉన్న వ్యక్తుల్లో ‘ఎంపతి’ అస్సలు ఉండదు. 

ఎదుటి వ్యక్తిని ఒక మనిషిగా కాకుండా, కేవలం ఒక వస్తువుగా లేదా తమ కోపాన్ని ప్రదర్శించే ఒక సాధనంగా మాత్రమే చూస్తారు.  సోషల్ మీడియాలో చూసే హింసాత్మక కంటెంట్ కూడా వీరి మెదడులోని హింసాత్మక ఆలోచనలకు ఇంధనంలా పనిచేస్తోంది.  వ్యక్తిత్వం  రూపుదిద్దుకునే  బాల్యంలో  సరైన పెంపకం లేకపోవడం, కుటుంబాల్లోని హింసను చూస్తూ పెరగడం లేదా తీవ్రమైన ఏకాంతానికి లోనవ్వడం వల్ల 'సైకోపాథిక్' ధోరణులు పెరుగుతాయి. 

పరిష్కార మార్గాలు  

ఈ వరుస హత్యలు చూస్తుంటే, సమాజం ఒక ‘హైపర్- సెన్సిటివ్’ స్థితిలో ఉందని అర్థమవుతోంది. రాజ్​కుమార్ ఘటన మనకు ఒక చేదు నిజం చెప్పింది. పగ, ప్రతీకారాన్ని పెంచుతుంది కానీ సమస్యను తీర్చదని.  మన సంబంధాలు సంతోషానికి మార్గంగా ఉండాలి, శ్మశానానికి దారిగా మారకూడదు. ఈ సంస్కృతి మారాలంటే మనం వ్యక్తిగత, సామాజిక, వ్యవస్థాగత స్థాయిలలో మార్పులు తేవాలి.  మొదటిది ఎమోషనల్ డిటాచ్మెంట్- యువతకు ఏ బంధమైనా శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని  చిన్నప్పటి  నుంచే బోధించాలి. తిరస్కరణ ఎదురైనప్పుడు దాన్ని ఎలా హుందాగా స్వీకరించాలో  నేర్పడం అవసరం.  

రెండోది మానసిక ఆరోగ్య పరీక్షలు కోపంతో ఊగిపోయే వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, అవసరమైతే సైకియాట్రిక్ చికిత్స అందించడం కుటుంబ సభ్యుల బాధ్యత. మూడోది విలువలతో కూడిన విద్య - చదువుకు ఇచ్చే ప్రాధాన్యత, వ్యక్తిత్వ వికాసానికి ఇవ్వడం లేదు. ఎదుటివారిని ఒక మనిషిగా గౌరవించడం, చట్టాన్ని గౌరవించడం అనేది పాఠశాల స్థాయిలోనే అలవాటు కావాలి. నాలుగోది మీడియా, సమాజం పాత్ర -ఇటువంటి ఘోరకలిని హీరోయిజంగా లేదా సెన్సేషన్​గా  చూపడం  ఆపాలి. 

ఇలాంటి హత్యల వెనుక ఉన్న మానసిక వైకల్యాన్ని హైలైట్ చేయడం వల్ల, ఇతరులలో  భయం కలిగేలా చూడాలి. అయిదోవది చట్టపరమైన వేగం కఠినమైన శిక్షలు పడటంతో పాటు, ఆ శిక్షలు అందరికీ తెలిసేలా వేగంగా అమలు కావాలి.  సమాజం బాగుండాలంటే, చట్టాలు మారడంతో పాటు మన ఆలోచనా ధోరణి మారాలి. చట్టాన్ని గౌరవిద్దాం,  జీవితాన్ని ప్రేమిద్దాం, పగను వదిలేద్దాం. ఇదే ఈ విషాదం మనకు ఇచ్చే పాఠం.

- డాక్టర్. హర్షిణి భాషవత్తిని,కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.