- కాళేశ్వరంలో దోచుకున్న అవినీతి సొమ్మే అందులో
- పెట్టుబడి పెట్టారు: విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, వెలుగు: మిల్చి మిల్క్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు భార్య తన్నీరు శ్రీనిత కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని.. అదంతా కాళేశ్వరంలో దోచుకున్న అవినీతి సొమ్మేనని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సంచలన ఆరోపణలు చేశారు. లేదంటే సైకిల్ మీద రబ్బరు చెప్పులతో తిరిగిన హరీశ్ రావుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరంలో హరీశ్ అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని, అందువల్లే కేసీఆర్ ఆయనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. హరీశ్ రావు తన సంస్థకు చెందిన పాలను ఆంధ్రా కాలేజీలైన శ్రీ చైతన్య, నారాయణతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టల్స్, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారని చెప్పారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హరీశ్ నిర్వాకం వల్ల ప్రభుత్వ రంగ డెయిరీలైన విజయ, మదర్ డెయిరీలు సర్వ నాశనమయ్యాయని విమర్శించారు. తాను చేసిన ఈ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించేందుకు రెడీగా ఉన్నానని, అసెంబ్లీ అయినా సరే, లేదంటే యాదగిరిగుట్టలో అయినా, భద్రాద్రి రాములోరి గుడిలోనైనా చర్చకు రావాలని విప్ అయిలయ్య సవాల్ విసిరారు.
