నిజామాబాద్, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల ఆఫీసర్లతో ఆమె రివ్యూ నిర్వహించారు. రక్షిత మంచినీటిని భవన నిర్మాణ పనులకు వాడొద్దని ఆదేశించారు. తాగునీటిని వృథా చేసేవారి నుంచి జరిమానాలు వసూలు చేయాలన్నారు. టౌన్ఏరియాల్లో రూ.10 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.5 వేల పెనాల్టీ వేయాలని ఆదేశించారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫాంఫండ్, వాటర్ షెడ్ నిర్మాణాలు చేపట్టాలని, గ్రౌండ్ వాటర్ లెవల్ తగ్గిన ఏరియాలపై ఫోకస్పెట్టాలన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలను కలెక్టర్ సమీక్షించారు. వచ్చేఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పుష్కరఘాట్లు ఇతర పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫండ్స్‌తో నిర్మాణాలు షురూ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఇరిగేషన్ ఇంజినీర్ ప్రకాశ్, ఆర్ డబ్ల్యూఎస్ఆఫీసర్లు ఉన్నారు.
