తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో జైలుకు వెళ్లిన బీజేపీ నేత అక్కడే వార్డు కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఓ ప్రజాప్రతినిధి జైలు లోపల ప్రమాణస్వీకారం చేయడం ఇదే ప్రథమం. తిరువనంతపురం కార్పొరేషన్ వళట్టుకోణం వార్డు నుంచి బీజేపీ నేత ఆర్. సుగతన్ గెలుపొందారు. మిగతా కౌన్సిలర్లతో పాటు ప్రమాణస్వీకారమూ చేశారు.
అయితే, అది చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన మరోమారు ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా ‘కాపా’ చట్టం కింద సుగతన్ అరెస్టై వియ్యూర్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. జైలులోనే ప్రమాణస్వీకారం చేయించాలని అధికారులను ఆదేశించింది. దీంతో తిరువనంతపురం మేయర్ వీవీ రాజేశ్ జైలు లైబ్రరీ హాల్‌లో సుగతన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ స్థానం బీజేపీకి అత్యంత కీలకం. 101 స్థానాలున్న కార్పొరేషన్‌లో బీజేపీ బలం 50 కాగా, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం వరుసగా మూడు కౌన్సిల్ సమావేశాలకు హాజరుకాకపోతే సుగతన్ పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రెండు సమావేశాలకు ఆయన దూరమయ్యారు. ఒకవేళ ఆయన అనర్హతకు గురైతే బీజేపీ బలం 49కి పడిపోయి, మేయర్ పీఠం ప్రమాదంలో పడుతుంది. మరోవైపు, ఈ ఘటన కార్పొరేషన్‌కు తీరని అవమానమని కాంగ్రెస్, సీపీఎం పార్టీలు విమర్శిస్తున్నాయి.
