నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ పట్టణంలో ఓటర్ల నమోదు డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ 32 శాతం మాత్రమే పూర్తయినందున, బీఎల్వోలు ప్రతిరోజూ 60 మంది ఓటర్ల వివరాలను నమోదు చేస్తూ త్వరగా లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అనంతరం ఉయ్యాలవాడలోని మెప్మా మహిళా కుట్టు మిషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆగస్టు 15లోగా పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులు అందేలా చూడాలని సూచించారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సదరన్ క్యాంపును పరిశీలించారు. దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, పెన్షన్లు పొందేందుకు అవసరమైన సదరం ధ్రువీకరణ పత్రాలను పారదర్శకంగా జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్ పర్సన్ తీగల సునేంద్ర, ఆర్డీఓ అర్చన, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి పాల్గొన్నారు.
