సింగరేణిని కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది..బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

సింగరేణిని కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది..బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
  • తాడిచర్ల 2 బ్లాక్​ సింగరేణికి లైఫ్ లైన్ అని వెల్లడి
  • భూపాలపల్లి, గోదావరిఖని బొగ్గుగనుల్లో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర

జయశంకర్ భూపాలపల్లి/ గోదావరిఖని/ మల్హర్/కోల్​బెల్ట్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం సింగరేణిని నిండా ముంచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్​ దారిలోనే కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా సింగరేణికి బకాయి పడిందని విమర్శించారు. బీఆర్ఎస్​ రూ.25 వేల కోట్లు అప్పు పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి రెండున్నరేండ్లలో రూ. 26 వేల కోట్లు బకాయి పడ్డారన్నారు.

సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8 ఇంక్లైన్ వద్ద గేట్ మీటింగ్ లో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మల్హర్ మండలం తాడిచర్ల బ్లాక్ 2 ను సందర్శించారు. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1లో గోదావరిఖని ఓపెన్​కాస్ట్​5 ప్రాజెక్ట్ కు చేరుకొని మాట్లాడారు. అప్పుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగరేణికి బకాయి పడిన రూ. 54 కోట్లు ఎందుకు చెల్లిండం లేదని ప్రశ్నించారు.

సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని.. అయినా, తమకు తెలియకుండానే సింగరేణి నిధులు దారి మళ్లుతున్నాయని అన్నారు. కొడంగల్​లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రూ. 500 కోట్ల సింగరేణి నిధులు మళ్లించారని ఆరోపించారు. 

కోల్ బ్లాకులు ప్రైవేటుకు పోనీయం 

సింగరేణి ఏరియాలో ఏ ఒక్క బ్లాక్ ను ప్రైవేట్ కు పోనీయమని, వేలం అయినా, నామినేషన్ పద్ధతి అయినా సింగరేణికే కేటాయిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ఒక్కబ్లాక్​ కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించలేదని, సింగరేణి నష్టాల్లో ఉండడంతో  దేశంలోనే అతిపెద్ద గని అయిన తాడిచర్ల 2 బ్లాక్ ను ప్రధాని సింగరేణికి కేటాయించారన్నారు. ఈ గని సింగరేణికి లైఫ్ లైన్ లాంటిదన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తాడిచర్ల- 2 ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందన్నారు.

ఈ గని ద్వారా 2వేల ఉద్యోగాలు వస్తాయని, మరో 5వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. తాడిచర్ల 2 బ్లాక్​ను వేలం లేకుండా సింగరేణికి ఎలా ఇస్తారని కొన్ని ప్రైవేటు కంపెనీలు తనను బెదిరిస్తున్నాయని, సింగరేణి కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని కిషన్​ రెడ్డి తెలిపారు.  కిషన్​రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు, ఎంపీలు ఈటల రాజేందర్, గొడం నగేశ్, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్​లీడర్​ఏలేటి మహేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేశ్​రెడ్డి, రామారావు పటేల్, వెంకటరమణా రెడ్డి, ధన్​పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మాజీ ఎంపీ వెంకటేశ్​నేత తదితరులు ఉన్నారు. 

బకాయిలు వెంటనే చెల్లించాలి 

కొత్త గనులు లేక ఉత్పత్తి తగ్గడం,  బకాయిలు వసూలు కాకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి సింగరేణి   బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోవాల్సి వచ్చిందని కిషన్​ రెడ్డి అన్నారు. సింగరేణి మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే  రూ.60 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి భరోసా యాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లాకు చేరుకోగా.. శ్రీరాంపూర్​ సింగరేణి ఏరియాలోని ఎస్సార్పీ- 3 బొగ్గు గనిపై గేట్​మీటింగ్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్​ఆర్​ గార్డెన్స్​లో బహిరంగసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. మణుగూరు గని-3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ విషయం లో కార్మికులకు త్వరలో శుభ వార్త చెపుతానని మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. అనంతరం బీజేపీ స్టేట్ చీఫ్​రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇచ్చి మోసపోయిన తెలంగాణ ప్రజలు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ. 13 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు.