మెదక్ టౌన్, వెలుగు : కోర్టు, పోలీసు శాఖల పరస్పర సమన్వయంతో నేరస్థులకు శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం అందించిన వారమవుతామని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కోర్టు-పోలీసు సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు, శాస్త్రీయ సాక్ష్యాధారాల సేకరణ, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కీలకమని పేర్కొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాస రావు మాట్లాడుతూ సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఏడాది మెదక్ జిల్లాలో 20 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని, అందులో 12 కేసుల్లో జీవిత ఖైదు పడిందని వివరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్రబోస్, సీఐలు మహేశ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జ్, రంగకృష్ణ, వెంకటరాజ గౌడ్, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, అధికారులు పాల్గొన్నారు.
