బడులు తెరిచి నెలరోజులైనా పుస్తకాలివ్వలే: ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

బడులు తెరిచి నెలరోజులైనా పుస్తకాలివ్వలే: ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా అందలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్ అవగాహన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల స్కూళ్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 20 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బంద్ పెట్టి వారి బతుకులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. 

అనంతరం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, అందుకే ప్రభుత్వం వేసిన సూట్ డిస్మిస్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ రెడ్డి, ప్రభుత్వ నిర్లక్ష్యం బట్టబయలైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు. గోదావరి-నల్లమల సాగర్‌పై బీఆర్ఎస్ మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉందని, బీఆర్ఎస్ నిలదీయడం వల్లే ప్రభుత్వం బ్యాక్‌డేట్ తో లేఖలు రాసిందన్నారు.

 ఏపీకి పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఈ క్రమంలోనే సూట్ కూడా సరిగా వేయలేకపోయారని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్టు పై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ల కోసం త్వరలోనే నారాయణఖేడ్ లోని బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు. కార్యక్రమంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,  జడ్పీ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు.