వేములవాడ, వెలుగు: తమ రక్తం తీసుకుని రైతులకు సాగునీరు ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా వేములవాడు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినర్సింహారావు అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడలోని తన నివాసంలో ‘రేవంత్‌రెడ్డికి రక్తదానం’ పేరిట శిబిరం ఏర్పాటు చేసి నాయకులతో కలిసి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి సాగుకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీళ్లు ఇవ్వాలని అడిగితే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంటల మీదే చల్లితే పంటలు పండుతాయని, రైతులను కించపరిచేలా మాట్లాడడం సీఎం స్థాయికి తగదన్నారు. కాళేశ్వరం నీళ్లను వెంటనే పంటపొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దాదాపు 25 మంది రక్తదానం చేశారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ తిరుపతి రెడ్డి, నాయకులు రామతీర్థపు రాజు, వి.శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు విజయ్, మధు, మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
