జూడో సమాఖ్య తాత్కాలిక కమిటీకి షరతులతో గుర్తింపు

జూడో సమాఖ్య తాత్కాలిక కమిటీకి షరతులతో గుర్తింపు

న్యూఢిల్లీ :   భారత జూడో సమాఖ్య (జేఎఫ్‌‌ఐ) తాత్కాలిక కార్యవర్గానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షరతులతో కూడిన గుర్తింపును మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో ఎన్నికైన ఈ కమిటీకి తక్షణమే గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే జేఎఫ్‌‌ఐ ఎన్నికలకు సంబంధించిన కేసులపై న్యాయస్థానాల తుది తీర్పునకు ఈ గుర్తింపు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం లేదా అవకతవకలు జరిగితే గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. జాతీయ క్రీడా పరిపాలన చట్టం–2025కు అనుగుణంగా సమాఖ్య రాజ్యాంగాన్ని సవరించి, తుది కార్యవర్గ ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల అమలు పురోగతిపై ప్రతి నెలా నివేదిక సమర్పించాలని, కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించింది. తాత్కాలిక కమిటీకి ముకేశ్ కుమార్ అధ్యక్షుడిగా, బనీ బ్రత దాస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మనీషా మల్హోత్రా కూడా కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు.