నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం :  యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమంతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా భవిష్యత్​లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి గ్రామంలో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఆయన నక్షా సర్వే ప్రక్రియను పరిశీలించారు. 

వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస గృహాలు, ప్లాట్ల వాస్తవ హద్దులను భూ యజమానుల సమక్షంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితంగా గుర్తించి నమోదు చేయాలని సర్వే సిబ్బందిని కలెక్టర్​ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తూ సర్వే ప్రక్రియను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారి సుజాత, సర్వేయర్ దేవా, రెవెన్యూ అధికారులు, సర్వే బృందాల సిబ్బంది పాల్గొన్నారు.