పోక్సో నిందితుడు.. బాలికను ఎత్తుకెళ్లాడు.. పోలీసుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన

పోక్సో నిందితుడు.. బాలికను ఎత్తుకెళ్లాడు.. పోలీసుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
  • బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు
  • పోలీసులు వదిలేయడంవల్లేనని బాలిక బంధువుల ఆరోపణ
  • యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ఘటన

అడ్డగూడూరు(యాదాద్రి), వెలుగు: పోక్సో కేసులో నిందితుడైన యువకుడు బాలిక(17)ను కిడ్నాప్​ చేయడం సంచలనంగా మారింది. షాబాద్‌‌‌‌లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువకముందే పొక్సో కేసులో నిందితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌‌‌‌లో అదే గ్రామానికి చెందిన బాలెంల చైతన్య ఓ బాలికపై లైంగికదాడికి ప్రయత్నించాడు. 

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు చైతన్యపై పొక్సో కేసు నమోదైంది.అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంతో మంగళవారం నిందితుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌‌‌‌లోని మలక్‌‌‌‌పేటకు చెందిన బాలిక ఇటీవల అడ్డగూడూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ నెల 9న బాలెంల చైతన్య గోడ దూకి బాలిక ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి, బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ఈ మేరకు బాలిక తల్లి, అమ్మమ్మ అడ్డగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో చైతన్యపై 10వ తేదీన పోక్సో యాక్ట్ సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినా పోలీసులు చైతన్యను అదుపులోకి తీసుకోలేదు. ఈ నెల 13న భువనగిరిలోని భరోసా సెంటర్‌‌‌‌‌‌‌‌లో బాలిక నుంచి వాగ్మూలం తీసుకున్నారు. 

అనంతరం బాలికను తల్లి వెంట మలక్​పేటకు పంపించారు. కాగా, మంగళవారం తెల్లవారుజామున మలక్​పేటలోని తన ఇంటి నుంచి బాలిక అదృశ్యమైంది. దీంతో తన కూతురిని చైతన్య కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి మలక్​పేట పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బీఎన్‌‌‌‌ఎస్ సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేశారు. అడ్డగూడూరు పోలీసులు నిందితుడు చైతన్య కోసం, మలక్​పేట పోలీసులు బాలిక కోసం  వెతుకుతున్నారు.

అరెస్ట్ కు ప్రొసీజర్ ఉంటుంది: ఎస్సై వెంకటరెడ్డి 

పోక్సో యాక్ట్ 11,12 ప్రకారం కేసు నమోదు చేసినా.. అరెస్ట్ చేయడానికి ప్రొసీజర్ ఉంటుందని అడ్డగూడూరు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లో ఆ బాలికే ఇంటి బయట గడియవేసి వెళ్లినట్టుగా అక్కడి పోలీసులు గుర్తించారని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరితో వెళ్లిందో తెలియదని పేర్కొన్నారు. తాము చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తున్నామని చెప్పారు.