హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతోందని తెలిపారు.
దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు అందుకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాల శాఖలు, వాతావరణశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు సకాలంలో సూచనలు అందించాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలను ఎంచుకోవాలని చెప్పారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల పంటలు సాగుచేయాలని చెప్పారు. వాతావరణశాఖ హైదరాబాద్ డైరెక్టర్ స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో నీటి మట్టాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరుకు వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్గోపి, రాహుల్ రాజ్, అగ్రివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
