అయిజ, వెలుగు : కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గద్వాల జిల్లా ధరూరు మండలం గార్లపాడుకు చందిన రంగస్వామి (33), గట్టు మండలం ఆలూరుకు చెందిన శివ (31), గద్వాలకు చెందిన మహేంద్ర, నాగేంద్ర బాబు, తేజ కలిసి మంగళవారం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి కారులో గద్వాలకు వస్తున్నారు.
అయిజ మండలం మేడికొండ శివారులోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రంగస్వామి, శివ అక్కడికక్కడే చనిపోగా మహేందర్, నాగేంద్రబాబు, తేజ తీవ్రంగా గాయపడ్డారు. నాగేంద్రబాబును కర్నూల్ హాస్పిటల్ కు, మిగతా ఇద్దరిని గద్వాల జిల్లా హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న అయిజ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
