పబ్లిక్ ప్లేసులో మూత్రం పోశారో.. మీ ఫొటో స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై పడ్డట్టే..! అస్సాంలో వినూత్న ప్రచారం

పబ్లిక్ ప్లేసులో మూత్రం పోశారో..  మీ ఫొటో స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై పడ్డట్టే..! అస్సాంలో వినూత్న ప్రచారం

తిన్సుకియా (అస్సాం): బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి బుద్ధి చెప్పేందుకు అస్సాంలోని తిన్సుకియా మున్సిపాలిటీ ఒక వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘హాల్ ఆఫ్ షేమ్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

ఎవరైనా బహిరంగంగా మూత్ర విసర్జన చేసినా లేదా చెత్త వేసినా ఆ దృశ్యాలను కెమెరాల్లో రికార్డ్ చేస్తారు. అలా నిబంధనలు ఉల్లంఘిస్తూ దొరికిపోయిన వారి ఫొటోలను పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన పెద్ద ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ వారి పరువు తీస్తున్నారు. ఈ చర్యతోనైనా అలాంటి వారు తమ అలవాట్లను మార్చుకుంటారని అధికారులు భావిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవరా ఈ వినూత్న ప్రచారాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.

 ముంబై లాంటి మెట్రో నగరాల్లోనూ ఇలాంటి పద్ధతినే అమలు చేయాలని ఆయన సూచించారు. అయితే, ఈ ప్రచారంపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం మౌలిక వసతుల కల్పనపై అధికారులను ప్రశ్నిస్తున్నారు.