ముంబై: అన్ని రాష్ట్రాల్లో టోకు ధరలు గత నెల పెరిగాయి. హోల్ సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 9.87 శాతానికి చేరింది. మే నెలలో ఇది 9.68 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి కారణం. పశ్చిమ ఆసియా సంక్షోభం, హార్మూజ్ దిగ్బంధం వల్ల ముడి చమురు సరఫరా దెబ్బతిని ఈ ప్రభావం పడింది.
నూనెలు, ఆహార పదార్థాలు, రసాయన ఉత్పత్తులు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి. జూన్‌లో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 27.41 శాతంగా ఉంది. మే నెలలో ఇది 30.33 శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మేలో 3.60 శాతం ఉండగా, జూన్‌లో 5.49 శాతానికి చేరింది. ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం 11.07 శాతం, ఖనిజాల ద్రవ్యోల్బణం 9.45 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం యథావిధిగా 7.48 శాతమే ఉంది.
