- పేలుళ్లు ధాటికి బీటలు వారుతున్న ఇండ్లు, పగులుతున్న అద్దాలు
- ఎల్ఎండీ గేట్ల సమీపంలోనూ బ్లాస్టింగ్స్
- డ్యామ్ సేఫ్టీపై అనుమానాలు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ను పట్టించుకోని కాంట్రాక్టర్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా బండ రాళ్లను తొలగించేందుకు నిర్వహిస్తున్న పేలుళ్లతో సమీపంలోని కాలనీలు దద్దరిల్లుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థ ఇష్టారాజ్యంగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడుతూ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జరిపే పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల కాలనీలన్నీ భూకంపం వచ్చినట్లు ఊగిపోతున్నాయి. పేలుళ్ల ధాటికి సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, బైపాస్ రోడ్డు, అలుగునూర్ ఏరియాల్లో ఇండ్ల గోడలు బీటలు వారుతున్నాయి.
మానేరు గేట్లకు దిగువన ఇంకా తొలగించాల్సిన భారీ సైజు బండరాళ్లు ఉన్నాయని, వీటి బ్లాస్టింగ్ పూర్తయ్యేలోగా మరెన్ని ఇండ్లు దెబ్బతింటాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండీ గేట్ల సమీపంలోనూ బ్లాస్టింగ్స్ చేస్తుండడంతో డ్యామ్సేఫ్టీపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దద్దరిల్లుతున్న కాలనీలు
మానేరు రివర్ ఫ్రంట్ పనులను రూ.410 కోట్ల అంచనా వ్యయంతో నాలుగేండ్ల కింద ప్రారంభించారు. కొన్ని రోజులుగా సెకండ్ ఫేజ్ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ లో భాగంగా క్రూయిజ్ బోట్లు, స్పీడ్ బోట్లు తిప్పడం, వాటర్ గేమ్స్ నిర్వహించడం కోసం స్పిల్ వే గేట్ల నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు 12 అడుగుల మేర నీళ్లు నిలిచేలా పనులు చేపట్టాల్సి ఉంది. నీళ్లలో బండరాళ్లు ఉంటే బోటింగ్ కు అడ్డంకిగా మారే అవకాశం ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు.
రాళ్ల తొలగింపు కోసం ఫస్ట్ ఫేజ్ లోనే సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని రోజులుగా స్పిల్ వే గేట్లకు, అలుగునూరు బ్రిడ్జికి మధ్య రాళ్లను బ్లాస్ట్ చేస్తున్నారు. అయితే బ్లాస్టింగ్స్ చేసే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా జిలెటిన్ స్టిక్స్ వాడుతుండడంతో వాటి దెబ్బకు కిలోమీటరు దూరంలో ఉన్న బైపాస్ రోడ్డు, అలుగునూర్ పరిసరాల్లోని పెద్దమ్మవాడ, ఎస్సీ కాలనీ, చౌరస్తా ప్రాంతాల్లోని భవనాలు, ఇండ్ల స్లాబులు, గోడలకు పగుళ్లు వస్తున్నాయి.
కిటికీలు, వెంటిలేటర్లకు అమర్చిన అద్దాలు పగిలిపోతున్నాయి. గతంలో కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఇలాగే రాళ్లు తొలగించేందుకు చేసిన బ్లాస్టింగ్ తో హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇండ్లు పగుళ్లు చూపాయి.
పట్టించుకోని ఇరిగేషన్ ఇంజినీర్లు
పేలుళ్లు జరుగుతున్న ప్రాంతం జనావాసాలకు, డ్యామ్‌కు దగ్గరగా ఉండడంతో తక్కువ తీవ్రత గల పేలుడు పదార్థాలతో కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయాల్సి ఉంది. కానీ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ మాత్రం త్వరగా పని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేలుళ్ల సమయంలో ఇండ్లు కంపించడంతో పాటు లోయర్ మానేరు డ్యామ్ కట్టకు, గేట్లకు తీవ్రమైన వైబ్రేషన్స్ వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వీటి కారణంగా ఇండ్లతో పాటు డ్యామ్ కట్ట, గేట్లు సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ ఇంజినీర్లు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
కట్టిన మూడేండ్లకే పగుళ్లు వచ్చినయి
మేం కొత్త ఇల్లు కట్టుకుని మూడేండ్లు కూడా కాలే. మానేరులో బండలను పెద్దపెద్ద బాంబులు పెట్టి పేల్చడంతో మా ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయి. కిటికీల అద్దాలు పగులుతున్నాయి. బాంబులు పేల్చినప్పుడు ఇల్లంతా అదురుతుంది. పేలుడు జరిగినప్పుడు చిన్న పిల్లలు భయపడుతున్నారు. అధికారులు స్పందించి పేలుళ్లు ఆపాలి. లేదంటే మా ఇండ్లు ఉండవు.
కత్తి రాజవ్వ, అలుగునూరు, పెద్దమ్మవాడ
పేలుడు వింటేనే భయమైతుంది
పేలుళ్ల ధాటికి మా ఇంటి లోపల కూడా పగుళ్లు వచ్చినయి. బాంబుల చప్పుడుకు ముసలోళ్లు, గుండె జబ్బులు ఉన్నోళ్లు ఆగమైతున్నరు. బాంబులు పెట్టుడు ఆపకపోతే మేమే పోయి పనులు ఆపుతం.
రాచమల్ల రాజేశ్వరి, అలుగునూరు, పెద్దమ్మవాడ
