సోయా.. నకిలీ మాయ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో ఏటా ఇదే తీరు.. నష్టపోతున్న రైతులు

సోయా.. నకిలీ మాయ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో ఏటా ఇదే తీరు.. నష్టపోతున్న రైతులు
  • విత్తినా మొలకెత్తని సోయా గింజలు...
  •     మళ్లీ విత్తుకునేందుకు కూలీలు, ఎరువుల కోసం అదనపు భారం
  •     నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలను బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని డిమాండ్
  •     కలెక్టరేట్​ వద్ద సోయా సంచులతో రైతుల నిరసన

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సోయా విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను డీలర్లు రైతులకు విక్రయించారు. కొనుగోలు చేసిన రైతులు విత్తినా మొలకెత్తకపోవడంతో కంపెనీల నకిలీలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రకం సోయా విత్తనాలు మొలకెత్తలేదంటూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. నేలలో తగినంత తేమ ఉన్నప్పటికీ మొలకలు కనిపించకపోవడంతో తవ్వి పరిశీలిస్తే విత్తనాలు కుళ్లిపోయి దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. కొంత మంది నకిలీ సోయా విత్తనాలు రైతులకు అంటగడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పలు ఘటనలు..

ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండల కేంద్రంతో పాటు లక్ష్మీపూర్​లో రైతులు దాదాపు 330 ఎకరాల్లో ఈ ఏడాది తేజశ్విని రకం సోయా విత్తనాలు వేశారు. జూన్ లో కురిసిన వర్షాలకు విత్తుకోగా.. 15 రోజులు గడిచినా మొలకెత్తలేదు. అనుమానంతో రైతులు తవ్వి చూడగా మొత్తం మాడిపోయాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా కుభీర్, భైంసా, ముథోల్ మండలాల్లోనూ వేసిన తేజశ్విని విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో గత గురువారం కుభీర్ మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ ను రైతులు ముట్టడించారు. నకిలీలను అడ్డుకోవాలని, తమను ఆదుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

అదనపు భారం భరించేదెవరు?

మొలకెత్తని విత్తనాలతో నష్టపోవడమే కాకుండా సోయా విత్తుకునేందుకు కూలీలు, దుక్కులు, ఎరువుల ఖర్చులు సైతం ఎకరానికి రూ.5 వేలకు పైగా రైతులు నష్టపోయారు. మొదటి సాగు విత్తుకునేందుకే ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి ఖర్చు అయిందని, ఇప్పుడు సదరు కంపెనీ వేరే రకం విత్తనాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. ఈ అదనపు ఖర్చుల భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​వద్ద బజార్​హత్నూర్​ రైతులు సోయా సంచులతో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు అండటగడుతున్న కంపెనీలను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని డిమాండ్ చేశారు.

ఐదెకరాల్లో మొలకెత్తలేదు

ఈ ఏడాది ఐదెకరాల్లో సోయా విత్తనాలు వేశాను. వర్షాలు పడిన సమయంలో విత్తుకున్నప్పటికీ మొలకెత్తలేదు. దీంతో వాటిని తవ్వి పరీశీలిస్తే నకిలీ విత్తనాలని తేలింది. ఇప్పుడు వాటి స్థానంలో వేరే విత్తనాలు ఇస్తామంటున్నరు.. కొనుగోలు చేసిన వాటికంటే రూ.700 తక్కువ ధరకు ఇస్తున్నారు. మరి మేము విత్తుకునేందుకు చేసిన మిగతా ఖర్చులు ఎవరివ్వాలి? నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోవాలి.  చంద్రశేఖర్, రైతు, బజార్ హత్నూర్