రాజన్న సిరిసిల్ల జిల్లా మైసమ్మ గుట్టపై.. కంగారూ, బల్లిని పోలిన రాతి చిత్రాల గుర్తింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా  మైసమ్మ గుట్టపై.. కంగారూ, బల్లిని పోలిన రాతి చిత్రాల గుర్తింపు

ముస్తాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా ద్వీపాల్లో మాత్రమే కనిపించే కంగారూ, ఎకిడ్నా వంటి జంతువులను పోలిన ప్రాచీన రాతి చిత్రాలను ‘మట్టి ఫౌండేషన్’ బృందం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్  మండలంలోని గన్నేవారిపల్లి గ్రామంలో గుర్తించింది. 

హైదరాబాద్ కు చెందిన ఫౌండేషన్  బృందం లీడర్  రెడ్డి రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఇక్కడ పర్యటించి పాత రాతి యుగం నాటి చిత్రాలను కనుగొన్నారు. తాము గుర్తించిన జంతువులు పసిఫిక్, హిందూ మహాసముద్రాల సరిహద్దుల్లో, ఆస్ట్రేలియాకు ఆగ్నేయంగా ఉన్న టాస్మానియా ద్వీపం, ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న న్యూగినియా ద్వీపాల్లో నివసించే జంతువుల చిత్రాలను పోలి ఉండడం నమ్మశక్యంగా లేదని టీమ్​ లీడర్​ రత్నాకర్​రెడ్డి తెలిపారు. 

సముద్ర మట్టానికి 407 మీటర్ల ఎత్తులో గుట్ట దిగువన ఉన్న మైసమ్మ గండి వద్ద పాత రాతియుగం, సూక్ష్మ రాతియుగ కాలం నాటి పనిముట్లు లభించాయని చెప్పారు. కంగారూ చిత్రం ఈ గుహకు ప్రధాన ఆకర్షణగా లేత ఎరుపు రంగుతో నింపిన పొడవైన దేహంతో ప్రకాశవంతంగా కనిపిస్తోందని తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి సముద్రాలు దాటి దక్కన్  పీఠభూమికి వచ్చిన ప్రాచీన మానవులు ఈ చిత్రాన్ని గీసి ఉంటారని ఆయన చెబుతున్నారు. లేదంటే పూర్వం ఇక్కడే కంగారూలు జీవించి ఉండవచ్చని చెప్పారు. 

పడగ రాయి కింద ఉన్న శిలలపై ముదురు ఎరుపు రంగులో గుర్రం, గాడిదలను వీటితో పాటు తాబేలు, బల్లి, పాము, చేయి పైకెత్తకుండా, ఒకే ఒక నిరంతర రేఖతో గీసిన ఐదు కోణాల నక్షత్రాలు మొదలైన చిత్రాలు కనిపించాయని తెలిపారు. పురావస్తు శాఖ ఈ చిత్రాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఇవి కంగారూ, ఎకిడ్నా చిత్రాలేనని నిర్ధారిస్తే.. మానవ పరిణామ క్రమంలో ఇదొక సుదీర్ఘమైన మానవ వలసగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఈ బృందంలో దేశెట్టి జితేందర్, కూన ప్రతాప్, కరికె బాబు, గన్నె జగదీశ్, కాంసాని కిశోర్, సముద్రాల రాజు, కొలిపాక రోహిత్, కాసగోని సృజన్, అనిల్, గన్నేవారిపల్లి సెక్రటరీ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.