- కేవలం రోడ్లేసి చేతులు దులుపుకొన్న కాంట్రాక్టర్
- అర్ధంతరంగా నిలిచిన స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు
- వానలు పడితే వరద నీటితో ఇబ్బందులు
- పనులు పూర్తి చేయాలని సభ్యుల డిమాండ్
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండ మినీ టెక్స్టైల్ పార్క్‌లో వరద ముప్పును నివారించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వరద నీరు పవర్లూమ్ యూనిట్లలోకి చేరకుండా సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపేశారు. దీంతో రానున్న వర్షాకాలంలో టెక్స్టైల్ పార్క్ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యమైన మెటీరియల్‌కు బదులుగా డస్ట్‌ను వినియోగిస్తున్నారని, దీంతో నెలల వ్యవధిలోనే రోడ్లు దెబ్బతింటున్నాయని పవర్లూమ్ ఇండస్ట్రీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
రూ.11.5 కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్..
సూరత్, భీవండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే చేనేత కార్మికులకు ఇక్కడే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ కింద ప్రభుత్వం మడికొండలో పవర్లూమ్ ఇండస్ట్రీస్ మంజూరు చేసింది. ఈ క్రమంలో 2009లో 364 మంది చేనేత కార్మికులతో కాకతీయ టెక్స్టైల్ అండ్ వీవర్స్ సొసైటీ ఏర్పాటైంది. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో 60 ఎకరాల్లో 364 పవర్లూమ్ యూనిట్ల ఏర్పాటుకు స్థలం కేటాయించగా, ప్రస్తుతం 164 యూనిట్లు ఏర్పాటయ్యాయి. దశాబ్దంన్నర కింద వేసిన రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో, ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు నిలిచి పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్య కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది టెక్స్టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11.5 కోట్లు మంజూరు చేసింది. సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రోడ్లు వేసి.. డ్రైన్స్ వదిలేసిన్రు..
మినీ టెక్స్‌టైల్‌పార్క్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దక్కించుకుంది. ఒప్పందం మేరకు 3.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, వాటికి ఇరువైపులా 7 కిలోమీటర్ల స్టార్మ్ వాటర్ డ్రైన్లు నిర్మించాలి. మొత్తం పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ కొంత మేర సీసీ రోడ్లు వేసి డ్రైన్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశాడు. వర్షాకాలానికి ముందే డ్రైన్ల నిర్మాణం పూర్తి చేసి వరద ముప్పును నివారించాల్సి ఉండగా, పనులు నిలిచిపోవడంతో డ్రైన్ల కోసం తవ్విన కందకాలు ప్రమాదకరంగా మారాయి. వాటి కారణంగా పలుచోట్ల పవర్లూమ్ ఇండస్ట్రీల కాంపౌండ్వాల్స్కూలే స్థితికి చేరుతున్నాయి.కందకాల పక్కనే ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్వాలిటీ లేకుండా సీసీ రోడ్డు వర్క్స్!
టెక్స్టైల్ పార్క్‌లో దాదాపు 90 శాతం సీసీ రోడ్ల నిర్మాణం మూడు నెలల కిందనే పూర్తయినా, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యమైన ఇసుకకు బదులుగా రోబో సాండ్ పేరుతో క్వాలిటీ లేని డస్ట్‌ను వినియోగించి పనులు చేపట్టినట్లు టెక్స్‌టైల్‌పార్క్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా మూడు నెలల్లోనే కొన్ని చోట్ల రోడ్లపై పగుళ్లు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. అలాగే, పనులను పూర్తి చేయించాల్సిన కాకతీయ టెక్స్టైల్ అండ్ వీవర్స్ సొసైటీ పాలకవర్గం కూడా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మడికొండ పవర్ ఇండస్ట్రీస్ లో స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు సీసీ రోడ్ల క్వాలిటీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వర్కర్లు వస్తలేరని చెబుతున్నరు..
రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులు ఎండాకాలంలోనే పూర్తి చేయాల్సి ఉంది. రోడ్లు పూర్తయ్యాయి, కానీ డ్రైన్ల పనులు కాలేదు. ఎండల తీవ్రతకు వర్కర్లు రావడం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. తొందర్లోనే వర్కర్లను రప్పించి పనులు చేస్తామని అంటున్నాడు. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో క్వాలిటీ పాటించాలని చెబుతున్నాం.- ఊరుగొండ శ్రీరాములు, ప్రెసిడెంట్, కాకతీయ వీవర్స్ సొసైటీ
ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు..
మడికొండ టెక్స్ టైల్ పార్కులో రోడ్డు వేసిన మూడు నెలలకే ఖరాబ్ అయి పగుళ్లు వస్తున్నాయి. క్వాలిటీ లేని డస్ట్ తోనే రోడ్లు వేస్తున్నారు. డ్రైన్ల నిర్మాణానికి కందకాలు తీసి వదిలేయడం వల్ల కాంపౌండ్ వాల్స్ కూలుతున్నాయి. ఇక్కడి సమస్యలను కలెక్టర్, టీజీ ఐఐసీ అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - పగడాల లక్ష్మీనారాయణ, కాకతీయ వీవర్స్ సొసైటీ సభ్యుడు
