ఏజెన్సీల్లో దూరాన్ని బట్టి దవాఖానలు..గిరిజన ప్రాంతాలకు కొత్త వైద్య పాలసీ: మంత్రి దామోదర

ఏజెన్సీల్లో దూరాన్ని బట్టి దవాఖానలు..గిరిజన ప్రాంతాలకు కొత్త వైద్య పాలసీ: మంత్రి దామోదర
  • ఐటీడీఏ దవాఖానల్లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలు
  • అన్ని పీహెచ్‌‌‌‌సీల్లో జనరేటర్లు.. ప్రతి మండలానికి అంబులెన్స్
  • కొత్తగా 4 డయాలసిస్ సెంటర్లను మంజూరుచేసినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభా ఆధారంగా కాకుండా, ప్రజలకు దగ్గరగా వైద్యం అందేలా దూరాన్ని బట్టి దవాఖానలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మంగళవారం సచివాలయంలో భద్రాద్రి కొత్తగూడెం ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల కోసం కొత్త వైద్య పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా దవాఖానల్లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కొత్తగూడెం మెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని, అన్ని పీహెచ్‌‌‌‌సీల్లో కరెంట్ కోతల ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి, కొమురారం దవాఖానలను అప్‌‌‌‌గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్, ఎల్లందులో ఐసీయూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, మరో నాలుగు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. రోగులు 20 నిమిషాల్లో డయాలసిస్ సెంటర్‌‌‌‌కు చేరుకునేలా సేవలు విస్తరించామని తెలిపారు.

అటెండెన్స్‌‌‌‌పై కమాండ్ కంట్రోల్ సెంటర్..

విధుల్లో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సిబ్బంది హాజరు పర్యవేక్షణ కోసం త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో పని చేయాలనుకునే డాక్టర్లకు అక్కడే పోస్టింగులు ఇవ్వాలని, కొత్తగూడెం ఎంసీహెచ్‌‌‌‌కు ప్రత్యేక ఇన్‌‌‌‌చార్జి సూపరింటెండెంట్‌‌‌‌ను నియమించాలని సూచించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు, టెస్టు కిట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

వరదల వల్ల రోడ్లు దెబ్బతినే అవకాశం ఉండటంతో గర్భిణులను ముందుగానే బర్త్ వెయిటింగ్ హాళ్లకు తరలించాలని చెప్పారు. 108, 102 అంబులెన్స్ సేవలకు ఎలాంటి అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. ఎమ్మెల్యేలు తరచూ దవాఖానలు సందర్శించి సమస్యలు తెలియజేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, కోరం కనుకయ్య, జారె ఆదినారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం దవాఖాన త్వరగా పూర్తి చేయాలి

ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖాన కొత్త భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. రూ.38 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అంతవరకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనాల్లో వైద్య సేవలు కొనసాగించాలని సూచించారు. తగిన సంఖ్యలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని మంత్రి పేర్కొన్నారు.