17వ రోజుకు వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాహార దీక్ష..క్షీణిస్తున్న ఆరోగ్యం..దీక్ష విరమించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తి

17వ రోజుకు వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాహార దీక్ష..క్షీణిస్తున్న ఆరోగ్యం..దీక్ష విరమించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: నీట్​లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారంనాటికి17వ రోజుకు చేరుకుంది. 

దీర్ఘకాలిక ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం, వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఇప్పటివరకు ఏకంగా 8.25 కిలోల బరువు తగ్గారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) 70 ఎంజీ/డీఎల్‌‌‌‌‌‌‌‌ కంటే పడిపోవడంతో నిరంతరం కళ్లు తిరగడం, తీవ్రమైన కండరాల నష్టం, శారీరక బలహీనతలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. 

నిరసనకారులు ఆయన పరిస్థితిని వివరిస్తూ, ‘ఆయన పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రతినిధి కూడా వచ్చి చర్చలు జరపకపోవడం దారుణం’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులతో సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్  తన సంకల్పాన్ని చాటారు. ‘‘బాహ్యంగా నా శరీరం బలహీనపడి ఉండవచ్చు, కానీ లోపల మాత్రం కొండంత పట్టుదలతో, బలంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.

దీక్ష విరమించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తి

వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూనే, దీక్ష విరమించాలని కోరారు. దీక్ష విరమించాలని తాను స్వయంగా వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌ను బ్రతిమిలాడానని, అయితే ఆయన దానికి నిరాకరించారని సీజేపీ ఫౌండర్​ అభిజీత్‌‌‌‌‌‌‌‌ దీప్కే చెప్పారు. “దీక్ష ఆపమని నన్ను అడగొద్దు.. కనీసం చర్చలు జరపడానికి కూడా ముందుకు రాని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి” అని వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ తనకు బదులిచ్చినట్టు వెల్లడించారు.  డీఎంకె ఎంపీ కనిమొళి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నా. నీట్ పరీక్షల పారదర్శకతపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

 కానీ దేశానికి ఆయనలాంటి నిబద్ధత గల లీడర్ల అవసరం ఎంతైనా ఉంది. న్యాయం కోసం పోరాటం సాగాలి.. కానీ ప్రాణాలను పణంగా పెట్టి కాదు. దయచేసి దీక్ష విరమించండి’’ అని విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ప్రకటిస్తూనే దీక్ష విరమించాలని ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’ వేదికగా కోరారు. ‘‘సోనమ్ సార్.. న్యాయం కోసం దేశ యువతను మీ దీక్ష ఏకం చేసింది. 

మీ లక్ష్యం నెరవేరింది. ఈ ప్రభుత్వానికి మీ ప్రాణాలన్నా, కోట్ల మంది యువత భవిష్యత్తన్నా పట్టింపు లేదు. కానీ మీ ప్రాణం మాకు చాలా ముఖ్యం. దయచేసి దీక్ష విరమించి, పోరాటాన్ని ఇతర మార్గాల్లో కొనసాగించండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే సైతం వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ దీక్షను విరమించుకోవాలని కోరారు.