ములుగు, వెలుగు : జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీసు ఆఫీసర్లు రాజీపడొద్దని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. మంగళవారం ములుగు జిల్లా పోలీసు ఆఫీస్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాలు, గంజాయి కేసుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. హైవేని ఆనుకొని ఉన్న గ్రామాల్లో గస్తీ పెంచాలని ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను పెట్టించేలా కృషి చేయాలన్నారు.
గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో బలమైన సమాచార వ్యవస్థ ఇన్ఫార్మర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహించి గంజాయి రవాణాను అడ్డుకోవాలన్నారు. యువత గంజాయి వినియోగానికి అలవాటు పడుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్స్ గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కోర్టు విచారణల్లో ఉన్న కేసుల పురోగతిపై దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
