జూబ్లీహిల్స్, వెలుగు: మోడలింగ్‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానంటూ నమ్మబలికి ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన మోడలింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతో ఓ యువతి స్కై మోడలింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది. ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు సలీం యువతిని అసభ్యకరంగా తాకాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో మోడలింగ్‌లో ఎదగాలంటే అడ్జస్ట్ కావాలి, ఈ ఫీల్డ్‌లో కామన్ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో భయపడిన ఆమె తాను శిక్షణ మానేస్తానని, తాను చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా.. అందుకు నిరాకరించాడు. తనకు పోలీసులతో సత్సంబంధాలు ఉన్నాయని, ఎదురు తిరిగితే కేసులు నమోదు చేయిస్తానంటూ బెదిరించినట్లు బాధిత యువతి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
