పద్మారావునగర్/ఎల్బీనగర్, వెలుగు: మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారాలని, అప్పుడే నేరాలను సకాలంలో గుర్తించడంతోపాటు, పిల్లల భద్రతను పటిష్ఠం చేయడం సాధ్యమవుతుందని పోలీస్‌కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో మహిళ భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం బోయిన్‌పల్లి, నాగోల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘సహచరి’కి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని సుమారు 3వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల హక్కులు, సైబర్ నేరాలు, షీ టీమ్స్ సేవలు, పోక్సో చట్టాలపై సీపీ అవగాహన కల్పించారు. మహిళలు సమాజ భద్రతలో భాగస్వాములై కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితం.. కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితం’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ‘సహచరి’ ద్వారా బస్తీ స్థాయిలో భద్రత మెరుగుపడి, పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ డా. యాదగిరిరావు మాట్లాడుతూ మహిళలు ప్రతి నెలా జరిగే సమావేశాల్లో భద్రతా అంశాలపై చర్చించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు అనురాధ, కె.సురేశ్‌కుమార్, శ్రీధర్, కె. రాహుల్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-1 టి. ఉషారాణి, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎ.లక్ష్మి పాల్గొన్నారు.
