ఎయిర్ పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి సాధించేవరకు పోరాడుతానని ప్రకటన పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వల్లే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పలుమార్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని సీఎం రేవంత్ రెడ్డితోపాటు కలిసి పెద్దపల్లి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.
ఉడాన్ స్కీమ్ కింద పెద్దపల్లిని కోరినా ఇప్పటివరకు స్పష్టమైన, సానుకూల నిర్ణయం రాలేదన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి కార్యకలాపాలతోపాటు పారిశ్రామిక, వ్యాపార లావాదేవీలు భారీగా జరుగుతుంటాయని, ఇక్కడ విమాన ప్రయాణికుల డిమాండ్ ఉందని వివరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈఎస్ఐ ఆస్పత్రిపై ఫలిస్తున్న ఎంపీ పోరాటం..
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటానికి స్పందించి రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణంలో కేంద్రం ముందడుగు వేయనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులశాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం గురించి మాట్లాడారు. మరోవైపు కేంద్రమంత్రితో ఎంపీ ఫోన్లో మాట్లాడి గతంలో టెండర్ దశలో ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాజెక్ట్ఆగిపోయిందని, దాన్ని వెంటనే పునఃప్రారంభించాలని కోరారు.
ఇక్కడ ఆwస్పత్రి నిర్మిస్తే వేలాది మంది కార్మికులకు అత్యాధునిక వైద్య సేవలందిచడానికి వీలుంటుందన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సానుకూలంగా స్పందించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి పూర్తయ్యేవరకు కేంద్రంపై పోరాడతానని ఆయన ప్రకటించారు.
