ఎన్నో అడ్డంకులు, వివాదాల తర్వాత ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ' జన నాయగన్' ( Jana Nayagan ) విడుదలకు సిద్ధం అయింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది వారాలుగా సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు.
రిలీజ్ డేట్ ఇదే..
ఈ చిత్రాన్ని 2026 జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దళపతి విజయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఖాకీ పోలీస్ యూనిఫామ్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించిన విజయ్, మరోసారి తన మాస్ ఇమేజ్‌ను గుర్తు చేశారు. పోస్టర్ డిజైన్‌లోనే రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తూ.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రద్దు..
ఇదిలా ఉండగా, కెనడాలోని యార్క్ సినిమాస్ (York Cinemas) విజయ్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఉండదని, టికెట్లు కేవలం థియేటర్ బాక్సాఫీస్‌లో మాత్రమే విక్రయిస్తామని ప్రకటించింది. టికెట్ విక్రయాలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి 24 గంటలు గతంలో 'జన నాయకన్' టికెట్లు కొనుగోలు చేసి, ఇంకా రీఫండ్ పొందని VIP సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి 48 గంటలు మిగతా VIP సభ్యులకు కేటాయిస్తారు. అనంతరం మాత్రమే సాధారణ ప్రేక్షకులకు టికెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. టికెట్ కొనుగోలు సమయంలో సభ్యత్వానికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
►ALSO READ | 'రా ఎన్టీఆర్' ఈవెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు.. తిరుపతి రావద్దని ఫ్యాన్స్ కు కృష్ణ యాదవ్ విజ్ఞప్తి!
రికార్డులు పక్కానా?
సెన్సార్ బోర్డుతో ఏడు నెలలపాటు కొనసాగిన ప్రతిష్ఠంభన కారణంగా గతంలో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులకు ప్రాధాన్యం కల్పించేందుకే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ వెల్లడించింది. అయితే ఈ నిబంధనలు కెనడాలోని యార్క్ సినిమాస్‌కే పరిమితం. ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో సాధారణ విధానంలోనే టికెట్ బుకింగ్స్ కొనసాగనున్నాయి. విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.
