Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుండటంతో ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ, తమ గ్రామంలోని ఏకైక ప్రభుత్వ ప్రాథమిక బడి పూర్తిగా మూతపడే పరిస్థితి రావడంతో, ఆ ఊరి గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.
జీరో ఎన్‌రోల్‌మెంట్.. టీచర్ బదిలీ:
నాగులపహాడ్ గ్రామంలో సుమారు 1,000 మంది జనాభా ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (1 నుంచి 5 తరగతులు) కేవలం 10 మంది స్టూడెంట్స్ మాత్రమే చదివారు. కానీ, ఈ ఏడాది ఆ 10 మంది కూడా ప్రైవేట్ పాఠశాలల్లో చేరిపోవడంతో, ఈ ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య 'జీరో' (Zero Enrolment) కి పడిపోయింది. దీంతో విద్యాశాఖ ఈ స్కూల్ ని 'జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్' గా ప్రకటించి, అక్కడ పని చేస్తున్న ఏకైక ఉపాధ్యాయుడిని మరో చోటికి బదిలీ చేసింది.
గ్రామ పంచాయతీ సరికొత్త ఐడియా:
తమ ఊరి బడి మూతపడటాన్ని జీర్ణించుకోలేని గ్రామ పంచాయతీ, ఎలాగైనా పాఠశాలను మళ్లీ ప్రారంభించాలని నడుం బిగించింది. ఈ క్రమంలో నాగులపహాడ్ గ్రామానికి చెందిన, ఒకప్పుడు అదే బడిలో చదువుకున్న ఎన్‌ఆర్‌ఐలు (NRIs) పాఠశాల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారి మద్దతుతో గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా కొన్ని ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరంలో ఎవరైతే తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలో చేర్పిస్తారో, ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఫ్రీగా ఇస్తామని తెలిపింది. అలాగే స్కూల్లో చేరే పిల్లలందరికీ ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ అందిస్తామన్నారు. అలాగే ఐదో తరగతి పూర్తి చేసుకుని, 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరి హైస్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక సైకిల్ బహుమతిగా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు.
ప్రైవేట్ స్కూల్ బస్సులపై నిషేధం:
గ్రామంలో 1 నుంచి 5 తరగతులు చదివే పిల్లలు దాదాపు 25 మంది వరకు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూడు వేర్వేరు ప్రైవేట్ స్కూల్స్ కి రోజూ బస్సుల్లో వెళ్తున్నారు. తల్లిదండ్రులను ఒప్పించేందుకు పంచాయతీ ప్రతినిధులు స్వయంగా ఇంటింటికీ వెళ్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే, గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులను అనుమతించబోమని పంచాయతీ పెద్దలు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
మా ఊరి బడిని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం: సర్పంచ్
గ్రామ సర్పంచ్ ఎస్. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరి బడిని కాపాడుకోవడానికే పంచాయతీ సభ్యులు, ఎన్‌ఆర్‌ఐల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. నేను కేవలం ఈ కానుకల కోసం కాదు, మా ఊరి బడిని బ్రతికించుకోవడం కోసమే నా పిల్లలను మళ్లీ ప్రభుత్వ బడికి పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ చొరవతోనైనా నాగులపహాడ్ ప్రభుత్వ బడి మళ్లీ పిల్లల కేరింతలతో కళకళలాడుతుందో లేదా చూడాల్సింది.
