ఒడిశాలోని పూరీ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగే ఈ మహోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. స్నానయాత్ర నుంచి నీలాద్రి బిజే వరకు అనేక ప్రత్యేక ఆచారాలు ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో భాగం. రథాలను లాగడం, దర్శనం చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం, ఆధ్యాత్మిక శుద్ధి, మోక్షం లభిస్తాయని కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తారు. జగన్నాధుడి రథ యాత్రలో ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . .!
దేశం నలుమూలల నుండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ రథయాత్ర గురించి మీరు తెలుసుకోవలసిన అనేక ప్రత్యేక విషయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది పూరీ జగన్నాథ యాత్ర ఆషాఢమాసం రెండో రోజు అనగా శుక్ల పక్షం విదియ రోజు ప్రారంభమవుతుంది. జగన్నాథ ఆలయం నుంచి స్వామి వారికి .. బలరాముడు.. వారి సోదరి సుభద్ర కు మూడు రథాలను సిద్దం చేస్తారు. అయితే ఈ రథాలను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. సాల్. వేప, సింబల్, ధౌరా అనే చెట్ల కలపను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ చెట్లను గుర్తించేందుకు ఆలయ అధికారులు ఒక కమిటీని నియమిస్తుంది.
ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ఈ మూడు రథాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జగన్నాథుని రథాన్ని గరుడధ్వజ లేదా నందిఘోష అని పిలుస్తారు. బలరాముని రథాన్ని తాళ ధ్వజ అని.. సుభద్ర దేవి రథాన్ని పద్మరథం లేదా దర్పదాలన్ అని అంటారు. జగన్నాథుడి నందిఘోష రథం 16 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి తాళధ్వజ రథం ఆకుపచ్చ-ఎరుపు రంగుల అలంకరణతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుభద్రాదేవి పద్మ రథం 12 చక్రాలతో నలుపు-ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడుతుంది. వసంత పంచమి రోజున కలప ఎంపిక మొదలై, అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది. రథాల తయారీలో మేకులు, ఇతర పదునైన లోహ వస్తువులను ఉపయోగించరు
రథయాత్ర ఐదో రోజైన ‘హేరా పంచమి’ నాడు, స్వామిని విడిచి వెళ్లారన్న ఆగ్రహంతో అమ్మవారు లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వచ్చి నందిఘోష రథ చక్రం వద్ద సంకేతక ఉత్సవాన్ని జరుపుతారు. ఆతరువాత స్వామి తన అత్తగారి ఇల్లు అయిన గుండిచా ఆలయంలో వారం రోజుల పాటు బస చేసి, ఆషాఢ శుక్ల దశమి తిథిన తిరుగు ప్రయాణం అవుతారు. దీనినే ‘బహుడ యాత్ర’ అంటారు. తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామిని, అమ్మవారిని గర్భాలయంలోకి ప్రవేశించే ప్రక్రియను ‘నీలాద్రి విజయం’ అని పిలుస్తారు.
రథయాత్ర సాగే మార్గంలో సాల్‌బేగ్ అనే ముస్లిం భక్తుడి సమాధి వద్ద కూడా రథం ఆగుతుంది. ఆయన తల్లి హిందువు, తండ్రి ముఘల్ సైనికుడు. పూరీ జగన్నాథాలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి రోజంతా పడుతుంది.
రథయాత్రకు సంబంధించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఈ రథం తాడులను లాగిన వారు పాపాల నుండి విముక్తి పొంది హరిలోకంలో స్థానం పొందుతారు. అందుకే రథయాత్ర సమయంలో రథాన్ని లాగడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
