హైదరాబాద్‌లో బ్రిక్స్ (BRICS) ట్రేడ్ యూనియన్ ఫోరమ్-2026 సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. ప్రపంచ లేబర్ ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. వైవిధ్యం, ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాద్ లో .. రెసిలెన్స్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్
ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. ప్రతి దేశ అభివృద్ధికి కార్మికుల కృషే మూలాధారమని, వారే దేశ ప్రగతికి నిజమైన శిల్పులని కొనియాడారు. కార్మికులకు గౌరవం, మంచి వేతనాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్మిక హక్కుల పరిరక్షణలో ట్రేడ్ యూనియన్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ఏఐ (AI), ఆటోమేషన్ యుగంలో స్కిల్ డెవలప్‌మెంట్ అత్యవసరమని మంత్రి వివేక్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రీన్ టెక్నాలజీ, ఏఐ రంగాలకు కార్మికులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ అంతా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలదేనని స్పష్టం చేశారు.
కార్మిక సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని.. ముఖ్యంగా గిగ్ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తూ, వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
అలాగేటామ్ కామ్ (TOMCOM) సంస్థ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలు, విదేశీ భాషలను నేర్పిస్తూ.. అంతర్జాతీయంగా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 16 దేశాల్లో 14 వేల మందికి విదేశీ ఉపాధి లభించిందని, హెల్త్‌కేర్, కేర్‌గివింగ్ రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని మంత్రి తెలిపారు.
బ్రిక్స్ దేశాల మధ్య లేబర్ మొబిలిటీ పెరగాలని, నైపుణ్యాల పరస్పర గుర్తింపుపై దేశాలు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళా కార్మికులకు సమాన అవకాశాలు, సురక్షితమైన పని వాతావరణం కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని.. వసుధైవ కుటుంబకం భావనతో గ్లోబల్ లేబర్ మార్కెట్‌ను బలోపేతం చేద్దామని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు.
