భారత్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ ఫైల్స్ లీక్.. కుడంకుళంపై సైబర్ దాడి..?

భారత్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ ఫైల్స్ లీక్.. కుడంకుళంపై సైబర్ దాడి..?

Kudankulam Nuclear Power Plant: భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతకు సంబంధించిన కొన్ని సున్నితమైన పత్రాలు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రముఖ అంతర్జాతీయ రాన్సమ్‌వేర్ ముఠా వరల్డ్ లీక్స్ (World Leaks) అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సర్వర్ల నుంచి దొంగిలించిన వేలాది ఫైళ్లను నెట్‌లో పెట్టింది. ఈ సమాచారం ప్లాంట్ కాంట్రాక్టరైన రిలయన్స్ గ్రూప్ ద్వారానే లీక్ అయినట్లు హ్యాకర్లు చెప్పుకొచ్చారు. 

రంగంలోకి CERT-In: 
థర్డ్-పార్టీ ఇండియన్ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యోట్టా (Yotta) హోస్ట్ చేసిన తమ సర్వర్‌లో ఒక పాక్షిక డేటా ఉల్లంఘన (Partial Breach) జరిగినట్లు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ అధికారికంగా ధృవీకరించింది. మే 29న సర్వర్‌లో అనుమానాస్పద చర్యలను గుర్తించి నిలిపివేసినట్లు యోట్టా తెలిపింది. అయితే, జూన్ చివర్లో ఈ డేటా లీక్ గురించిన సమాచారం బయటకు రావడంతో రిలయన్స్ స్పందించి, ప్రభుత్వ రక్షణ సంస్థలకు సమాచారం అందించింది. ప్రస్తుతం భారత ప్రధాన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In ఈ సైబర్ దాడిపై దర్యాప్తు చేస్తోంది.

లీకైన పత్రాల్లో ఏముంది?.. కోర్ రియాక్టర్లు సురక్షితమేనా!: 
రష్యాకు చెందిన ప్రభుత్వ యాజమాన్య సంస్థ రోసటమ్ సరఫరా చేసే అణు రియాక్టర్ల ప్రధాన కోర్ సిస్టమ్స్ (Core Systems) డేటాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కానీ, లీకైన 19,000 సున్నితమైన ఫైళ్లలో (2016 నుంచి 2025 మధ్యకాలానికి చెందినవి) ఉన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, 2027 నాటికి అందుబాటులోకి రావలసిన యూనిట్ 3, యూనిట్ 4ల వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్ బ్లూప్రింట్లతో పాటు ప్లాంట్ లోని అత్యంత కీలకమైన కామన్ కంట్రోల్ రూమ్ యొక్క పూర్తి ఫ్లోర్ లేఅవుట్, ప్లాంట్‌కు పరికరాలు సరఫరా చేసే వెండర్ల ప్రతిపాదనలు, సప్లయర్ల పూర్తి జాబితా, 2024 నాటి ఉమ్మడి తనిఖీ రికార్డులు లీకైనట్లు తెలుస్తుంది. ఒకవేళ యూనిట్ 3 లేదా యూనిట్ 4 పై ఉగ్రవాద దాడి జరిగితే లభించే $112 మిలియన్ల (సుమారు రూ. 930 కోట్లు) క్లెయిమ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.

►ALSO READ | నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలక్ట్రిక్ వెహికల్కు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు

పొంచి ఉన్న ప్రమాదంపై నిపుణులు వార్నింగ్: 
ఈ డేటా లీక్ వల్ల అణు ప్లాంట్‌కు ముప్పు పొంచి ఉందని న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ సీనియర్ డైరెక్టర్ నికోలస్ రాత్ హెచ్చరించారు. ఈ సమాచారం గానీ శత్రువుల చేతికి చిక్కితే, వారు ప్లాంట్ యొక్క సపోర్ట్ సిస్టమ్స్‌ను సులభంగా మ్యాప్ చేయగలరు. రక్షణ వలయంలోని బలహీనతలను గుర్తించి, ప్లాంట్‌లోకి ఎవరు, ఏ వ్యవస్థల ద్వారా ప్రవేశించవచ్చో అంచనా వేసే ప్రమాదం ఉందని సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ నికోలస్ రాత్ చెప్పుకొచ్చాడు. 

సైబర్ హైజీన్ మరింత పటిష్టం: 
గ్లోబల్ డేటా బ్రీచ్‌లలో అమెరికా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ సర్ఫ్‌షార్క్ నివేదిక నిజమేనని ఈ ఘటనతో మరోసారి రుజువు అయింది. కూడంకుళం ప్లాంట్‌పై ఇలాంటి సైబర్ ముప్పు రావడం ఇది సెకండ్ టైమ్ (గతంలో 2019లో ఉత్తర కొరియా హ్యాకర్ల మాల్వేర్ దాడి).. ఇప్పటికైనా భారత కార్పొరేట్, రక్షణ రంగ సంస్థలు తమ సైబర్ హైజీన్, భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.