హైదరాబాద్: తెలంగాణలో SIR ప్రక్రియ గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్ట్ 3 వరకూ గడువు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జూన్ 25 నుంచి జులై 24 వరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల నమోదు, సవరణల ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమం జరుగుతుందని తొలుత ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే.. ప్రభుత్వం నుంచి గడువు పొడిగించాలని వినతులు రావడంతో ఎన్నికల సంఘం ప్రభుత్వ అభ్యర్థనపై సానుకూలంగా స్పందిస్తూ ఆగస్ట్ 3 వరకూ SIR గడువు పొడిగించింది. ఫాం నింపకపోయినా, నింపిన ఫాం ఇవ్వకపోయినా ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు గణన ఫారంలో పలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జనన సంవత్సరం ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండటంతో పాటు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, నియోజకవర్గం, భాగం సంఖ్య, ఓటరు క్రమ సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంది.
వివాహానికి ముందు, తర్వాత రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఒకదాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంది. ఈ వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఓటు తొలగిపోతుందనే భయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని చదువుకున్న ఓటర్లు కూడా దరఖాస్తులు నింపడంలో సందిగ్ధానికి గురవుతున్నారు.
