ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ మీడియా వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి నంద్ కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం భారీ విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో "శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం" నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించి, వచ్చే ఏడాది ప్రారంభం నుంచే యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ విశ్వవిద్యాలయం ద్వారా తన తండ్రి విలువలు, ఆదర్శాలు రాబోయే తరాలకు చేరవేయాలన్నదే తమ లక్ష్యమని సుభాష్ చంద్ర పేర్కొన్నారు. ఇందులో సోషల్ సర్వీస్, దాతృత్వంపై ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయంలో తగిన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
నంద్ కిషోర్ గోయెంకా 1930 సెప్టెంబర్ 28న జన్మించారు. క్రమశిక్షణ, విలువలు, సేవాభావానికి ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సామాజిక సేవకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన విలువలను చిరస్థాయిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుభాష్ చంద్ర వెల్లడించారు.
