మహిళ దుస్తులు లాగటం నేరం కాదా ? పాట్నా హైకోర్టు తీర్పుపై క్లాస్ పీకిన సుప్రీంకోర్టు

మహిళ దుస్తులు లాగటం నేరం కాదా ? పాట్నా హైకోర్టు తీర్పుపై క్లాస్ పీకిన సుప్రీంకోర్టు

ఒక మహిళ దుస్తులు లాగటం, ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం 'అత్యాచార యత్నం' కిందకు రాదంటూ పాట్నా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాల కిందికే వస్తాయని చెప్తూ, అత్యాచార యత్నం కేసులో ఒక నిందితుడికి పడిన శిక్షను పాట్నా హైకోర్టు రద్దు చేసింది.

ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులు ఇలాంటి విచిత్రమైన తీర్పులు ఇవ్వడం తరచూ జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 9న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు సరిగ్గా పరిశోధన చేసి, పాత సుప్రీంకోర్టు తీర్పులను మనసులో ఉంచుకుని మాట్లాడాలని సూచించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు:
*కోర్టులన్నీ ఇలాంటి కేసుల్లో ఇచ్చే నియమ నిబంధనల పుస్తకాన్ని (హ్యాండ్‌బుక్) కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
*పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేటప్పుడు, ఛార్జిషీట్ వేసేటప్పుడు కూడా ఈ నిబంధనలను పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
*లైంగిక నేరాల కేసుల్లో న్యాయమూర్తులు ఎలా వ్యవహరించాలనే దానిపై 'నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ' ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి రెండు కేసులను స్వయంగా (సుమోటోగా) విచారణకు స్వీకరించింది.

గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు:
గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి వివాదాస్పద తీర్పులే ఇచ్చింది. ఒక కేసులో, చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి లాకెళ్లడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కిందికి రాదని పేర్కొంది.

మరో కేసులో, రేప్ కేస్ నిందితుడికి బెయిల్ ఇస్తూ.. "బాధితురాలు మద్యం సేవించి నిందితుడి ఇంటికి వెళ్లడం వల్లే ఈ సమస్యను కొనితెచ్చుకుంది" అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.